కూకట్​పల్లిలో ఇద్దరు బాలికల మిస్సింగ్ ఘటనలో కీలక మలుపు

కూకట్​పల్లిలో ఇద్దరు బాలికల మిస్సింగ్ ఘటనలో కీలక మలుపు

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లిలో ఇద్దరు బాలికల మిస్సింగ్ ఘటన మలుపు తిరిగింది. ఏపీ బాపట్లలోని సూర్యలంక బీచ్​లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ ప్లాన్ ప్రకారమే అక్కడికి వెళ్లినట్లు తేల్చారు. కూకట్​పల్లి ఏసీపీ శ్రీనివాసరావు వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్టకు చెందిన ఇద్దరు బాలికలు కూకట్​పల్లి వివేకానందనగర్​లోని ఓ కార్పొరేట్​స్కూల్​లో 8వ తరగతి చదువుతున్నారు. వీరిలో ఒకరి స్వగ్రామం సూర్యలంక బీచ్​ సమీపంలో ఉండడంతో తరచూ ఆ బీచ్​ అందాల గురించి మరో బాలికకు చెబుతుండేది. క్లాస్​రూమ్​లో వీరు తరచూ సూర్యలంకకు వెళ్లాలని మాట్లాడుకోవడం తోటి విద్యార్థులు విన్నారు.

ఈ నెల19న వీరిద్దరూ రోజూ మాదిరిగానే స్కూల్​కు వెళ్లారు. సాయంత్రం 4.30 గంటకు స్కూల్ అయిపోయాక సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోకి వెళ్లారు. ఆ తర్వాత స్కూల్ ​డ్రెస్​ తీసేసి తమ వెంట తెచ్చుకున్న సివిల్​ డ్రెస్​ వేసుకుని బయటకు వచ్చారు. ఇంటికి వెళ్లకుండా సూర్యలంక బీచ్​కు వెళ్లారు. ఎక్కడా గాలించినా బాలికల ఆచూకీ లభించకపోవడంతో వారి తల్లిదండ్రులు బుధవారం కూకట్​పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా గురువారం బాలికలను ఆంధ్రప్రదేశ్​ బాపట్ల సమీపంలోని సూర్యలంకలో ఉన్నట్టు గుర్తించారు. వీరిని శుక్రవారం నగరానికి తీసుకువచ్చే అవకాశం ఉంది. అయితే, వీరిద్దరే ఇక్కడి నుంచి సూర్యలంక వరకు వెళ్లారా లేక వేరే ఎవరైనా వీరికి సహకరించి ఉంటారా? అనేది బాలికలు వస్తేనే తెలుస్తుందని ఏసీపీ తెలిపారు.