భర్త, బంధువులు అవమానించడంతోనే హత్య..  వీడిన సాయిలు మర్డర్ ​మిస్టరీ

భర్త, బంధువులు అవమానించడంతోనే హత్య..  వీడిన సాయిలు మర్డర్ ​మిస్టరీ
  •   కొడుకు పెండ్లి విషయంలో భర్తతో గొడవ 
  •   సిటీకి తీసుకొచ్చి కరెంట్​ షాక్ ​ఇచ్చి చంపిన భార్య

కూకట్​పల్లి, వెలుగు: భర్తతోపాటు అతని తరఫు బంధువులు అవమానించడంతోనే కవిత.. సాయిలును చంపినట్లు తేలింది. కూకట్​పల్లి ఏసీపీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్​జిల్లా పాపన్నపేట మండలం పాత లింగాయపల్లికి చెందిన బోయిని సాయిలు(42), కవిత(37) భార్యాభర్తలు. ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. కాగా సాయిలు, కవితకు పెండ్లి అయినప్పటి నుంచే విభేదాలు ఉన్నాయి. ఇద్దరికీ వివాహేతర సంబంధాలు ఉన్నాయి. 15 ఏండ్ల కింద ఎయిడ్స్​బారిన పడ్డారు.

అప్పటి నుంచి విడాకులు తీసుకోకుండానే వేర్వురుగా ఉంటున్నారు. పిల్లలు సాయిలు వద్దనే ఉంటున్నారు. సాయిలు ఊర్లో కూలి పనులకు వెళ్తుండగా, కవిత తరచూ సిటీకి వచ్చి వెళ్తుంటది. కవిత ఊరికి వెళ్లిన ప్రతిసారి సాయిలుతో గొడవ జరిగేది. దీంతో భర్త మీద కవిత కక్ష పెంచుకుంది. వారం కింద కవిత ఊరికి వెళ్లగా, పెద్ద కొడుకుకి సాయిలు అక్క కూతురితో పెండ్లి నిశ్చయం అయిందని తెలిసింది. తనకు తెలియకుండా కొడుకుకు పెండ్లి ఎలా చేస్తావని భర్తతో మరోసారి గొడవపడింది.

తన కుటుంబం విషయంలో జోక్యం చేసుకోవద్దని సాయిలు సీరియస్​గా చెప్పాడు. అతని తరఫు బంధువులు కూడా కవితను దూషించారు. దీంతో ఎలాగైనా భర్తని హత్య చేయాలని నిర్ణయించుకున్న కవిత సిటీకొచ్చి చెల్లెలు, మరిదితో స్కెచ్​వేసింది. ఇకపై మంచిగా ఉందని సాయిలును సిటీకి పిలిపించింది. 19న రాత్రి కల్లు తాగించి కరెంట్​షాక్​ఇచ్చి చంపేసింది. తర్వాత ప్లాస్టిక్​కవర్​లో ప్యాక్​చేసి అర్ధరాత్రి తర్వాత ఆటోలో సంగారెడ్డి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. దారిలో శ్మశానవాటిక వద్ద ఆపాలని కోరగా, అనుమానంతో ఆటో డ్రైవర్​వల్లినాయక్​ఆపలేదు.

సంగారెడ్డికి వద్దంటే ఎక్కిన చోటే దింపుతానంటూ అడ్డం తిరిగాడు. దీంతో చేసేదేం లేక తిరిగి కేపీహెచ్​బీలోని మిత్ర హిల్స్​లో హత్య చేసిన ఇంటికి తీసుకువచ్చారు. సమీపంలోని నిర్మానుష ప్రదేశంలో పాతి పెట్టారు. తర్వాత ఏమీ తెలియనట్టు ఊరికి వెళ్లింది. ఆటోడ్రైవర్ వల్లినాయక్​20న ఉదయం కేపీహెచ్​బీ పోలీసుస్టేషన్​కు వెళ్లి ముందు రోజు రాత్రి జరిగిన విషయాన్ని వివరించాడు. పోలీసులు ముందుగా జ్యోతి, మల్లేశ్​ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. హత్య చేశారని నిర్ధారించుకున్నాక కవితను కూడా అరెస్ట్​ చేశారు.