Kuldeep Yadav: నేను వెతుక్కున్నా.. ఇంకొకరితో నా పెళ్లి చేయకండి: కుల్దీప్‌ యాదవ్

Kuldeep Yadav: నేను వెతుక్కున్నా.. ఇంకొకరితో నా పెళ్లి చేయకండి: కుల్దీప్‌ యాదవ్

సినీ హీరోల పెళ్లంటేనే.. ఓ ముగ్గురు నలుగురు వధువులను తెరమీదకు తెస్తారు.. మన అభిమానులు. అలాంటిది భారత క్రికెటర్.. అందునా, టీ20 ప్రపంచకప్ విజేత పెళ్లంటే కామ్‌గా ఉంటారా..! ఏకంగా వధువునే మార్చేశారు. భారత స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్.. త్వరలో నేను ఓ అమ్మాయిని పెళ్లాడబోతున్నాను అని తీపి కబురు అందించాడు. ఇంకేముంది, అభిమానులు.. ఆ అమ్మాయి ఎవరో తమకు తెలుసంటూ ఓ బాలీవుడ్ నటిని తెరమీదకు తెచ్చారు. చివరకు, ఇదెక్కడ అసలకు కొసరు తెస్తుందో అని భయపడ్డ కుల్దీప్.. కాదు, కాదు.. ఆమె బాలీవుడ్ నటి కాదు వివరణ ఇచ్చుకున్నాడు.

సొంత ఇలాకాలో ఘన స్వాగతం

టీ20 ప్రపంచకప్‌  విన్నింగ్‌ జట్టులో కుల్దీప్‌ యాదవ్‌కు ఇటీవల సొంత గడ్డ కాన్పూర్‌లో ఘన స్వాగతం లభించింది. అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి టపాసులు, డోలు చప్పుళ్ల మధ్య ఊరేగిస్తూ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కుల్‌దీప్‌ తన వ్యక్తిగత జీవితం గురించి కీలక విషయం వెల్లడించాడు. తన జీవితంలోకి మరొకరు వస్తున్నారంటూ బాంబు పేల్చాడు. అయితే, ప్రైవసీ దృష్ట్యా వధువు ఎవరనేది భారత స్పిన్నర్ బయటకు వెల్లడించలేదు. దాంతో, అభిమానులు కొత్త ఊహాగానాలకు తెరలేపారు.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 

కుల్దీప్ గత కొంత కాలంగా బాలీవుడ్‌ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో స్నేహం సాగిస్తున్నట్లు రూమర్స్‌ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత స్పిన్నర్.. ఆమెను పెళ్లాడబోతున్నట్లు పుకార్లకు తెరలేపారు. వీటిపై స్పందించిన కుల్దీప్ అవి నిజం కాదని తెలిపాడు. తాను పెళ్లి చేసుకోబోయేది సినిమా రంగానికి చెందిన అమ్మాయి కాదని వివరణ ఇచ్చాడు. తనను, కుటుంబాన్ని బాగా చూసుకునే అమ్మాయి తన జీవితంలోకి రావడం చాలా ముఖ్యమని వివరించాడు.

"మీకు త్వరలోనే శుభవార్త అందుతుంది. నేను పెళ్లాడబోయే వధువు నటి కాదు. ఆమె నన్ను, నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం" అని కుల్దీప్ జాతీయ మీడియాతో చెప్పారు.

భావోద్వేగ సందేశం

మరోవైపు, పొట్టి ప్రపంచకప్ గెలవడంపై కుల్దీప్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ క్షణాల కోసం తాను ఎన్నో ఏళ్ల నుంచి వేచి చూసినట్లు తెలిపాడు. వ్యక్తిగతం కంటే కూడా టీమ్‌గా ఈ కప్‌ భారత్‌కు చాలా అవసరమని పేర్కొన్నాడు. 

"సహచరులకు, సహాయక సిబ్బందికి, మీడియాకు, టోర్నమెంట్ అంతటా మాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము మీ అందరినీ అలరించి, మీకు, మీ కుటుంబానికి ఆనంద క్షణాలను అందించామని ఆశిస్తున్నాను. కప్ హోమ్ అబ్బాయిలు.." అని కుల్దీప్ ఎక్స్ లో పోస్ట్ చేశాడు.

కాగా, టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీలో 10 వికెట్లు తీసిన కుల్దీప్.. భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.