వెలుగుస్పోర్ట్స్‌డెస్క్ : ఆసియా కప్‌లో టీమిండియా సూపర్ పెర్ఫామెన్స్ చేస్తోంది. సూపర్–4లో వరుసగా రెండు విక్టరీలతో ముందుగానే, మరో మ్యాచ్ మిగిలుండగానే ఫైనల్ చేరుకుంది. కెప్టెన్ రోహిత్ వరుస ఫిఫ్టీలు, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీలతో ఆకట్టుకున్నా ఈ రెండు విజయాల్లో కీలక పాత్ర పోషించింది చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవే. పాకిస్తాన్‌తో ఫ్లాట్ వికెట్‌పై ఐదు వికెట్లు పడగొట్టిన కుల్దీప్.. శ్రీలంకపై నాలుగు వికెట్లు తీయడంతో చిన్న టార్గెట్‌ను టీమిండియా కాపాడుకోగలిగింది. ఈ రెండు మ్యాచ్‌లే కాదు కొన్నాళ్లుగా తను అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ ఏడాది ఆడిన వన్డేల్లో 31 వికెట్లు పడగొట్టాడు.
టెస్టు ఆడుతున్న జట్లలో ఓ బౌలర్‌కు ఇవి అత్యధికం. వరల్డ్ కప్ ముంగిట కుల్దీప్ టాప్ ఫామ్‌లోకి రావడం జట్టుకు చాలా సానుకూలాంశం. గాయాలు, పేలవ ఆటతో రెండేండ్ల కిందట జట్టుకు దూరమై ఇక తన పనైపోయిందని అనుకున్న వారికి ఇప్పుడు కుల్దీప్ పెర్ఫామెన్స్ ఆశ్చర్యంగా, అద్భుతంగా కనిపిస్తోంది. టీమ్‌లో ఓ వెలుగు వెలిగి.. అనూహ్యంగా వెనకబడిన అతను తిరిగొచ్చిన తీరు నిజంగా అద్భుతమే.
ఆకాశం నుంచి పాతాళానికి
చైనామన్ బౌలర్‌గా కొన్నేండ్ల పాటు టీమిండియాలో కుల్దీప్ హవా నడిచింది. విదేశాల్లో ఇండియా మెయిన్ స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో ఇండియా ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరింటిలో బరిలోకి దిగాడు. మరీ ముఖ్యంగా లెజెండరీ ప్లేయర్ ఎంఎస్ ధోనీ, కీపర్‌గా ఉన్నప్పుడు కుల్దీప్ పట్టిందల్లా బంగారమయ్యేది. వికెట్ల వెనకాల నుంచి బ్యాటర్ల ఆటను చదివేసే మహీ చెప్పినట్టుగా బౌలింగ్ చేసి కుల్దీప్ చాలాసార్లుమ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. కానీ, ధోనీ రిటైర్మెంట్, కరోనా వల్ల ఆటకు కొంత బ్రేక్ వచ్చిన తర్వాత కుల్దీప్ కెరీర్ స్పీడ్‌కు బ్రేక్ పడింది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ అతడిని పక్కనబెట్టింది. 2021సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ అతనికి చాన్స్ ఇవ్వలేదు.
ALSO READ: 66 డివిజన్ల మీటింగ్.. అరగంటలోనే ముగిసింది
అంతకుముందు రెండు ఎడిషన్లలోనూ 14 మ్యాచ్‌ల్లోనే చాన్స్ వచ్చింది. ఇంకోవైపు పేలవ ఫామ్ కారణంగా నేషనల్ టీమ్‌లో కూడా అతనికి అవకాశాలు తగ్గాయి. 2020–2021 అన్ని ఫార్మాట్లలో కలిపి ఏడు మ్యాచ్‌లే ఆడాడు. అతని మిస్టరీని చదివేసిన బ్యాటర్లు తను బౌలింగ్‌కు రాగానే ఎటాక్ చేశారు. కంట్రోల్ తప్పి భారీగా రన్స్ ఇచ్చుకున్న కుల్దీప్‌లో ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లింది. దాంతో అతని పరిస్థితి ఆకాశం నుంచి పాతాళానికి పడిపోయినట్టయింది. 2021 చివర్లో మోకాలి గాయం 4 నెలలు ఆటకు దూరం చేసింది. కానీ, ఆ గాయమే కుల్దీప్ జీవితంలో పెద్ద మలుపు అయింది.
2.0 వెర్షన్
మోకాలి గాయానికి సర్జరీ చేయించుకున్న తర్వాత కుల్దీప్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్‌లో చేరాడు. ఆ సమయంలోనే తను ఆలోచనలో పడ్డాడు? అసలు తన కెరీర్ ఇలా ఎందుకు మారింది? తన బౌలింగ్‌లో ఏం తప్పు జరుగుతోంది? అనే విషయాలను విశ్లేషించుకున్నాడు. తన టెక్నిక్‌ను మార్చుకుంటేనే గాడిలో పడగలనన్ననిర్ణయానికి వచ్చాడు. అందుకు ఇండియా మాజీ స్పిన్నర్, సెలెక్టర్ సునీల్ జోషి సాయం తీసుకున్నాడు. చిన్నపాటి టెక్నికల్ అడ్జస్ట్‌మెంట్స్ చేసుకొని ఇప్పుడు స్టాంప్స్‌ను ఎటాక్ చేస్తూ వైట్‌బాల్ ఫార్మాట్లో మళ్లీ ఇండియా టాప్ స్పిన్నర్ అయ్యాడు. దాంతోపాటు స్ట్రెయిట్ రనప్, బంతి వేసిన తర్వాత చేయి పడిపోకుండా బ్యాటర్ వైపు కదిలేలా మార్చుకున్నాడు.
అదే సమయంలో తన బంతుల్లో కొంచెం వేగం కూడా పెంచాడు. కానీ, డ్రిఫ్ట్, టర్న్‌లో ఎలాంటి మార్పు లేకుండా చూసుకున్నాడు. ఫలితమే ఆసియా కప్‌లో కుల్దీప్ అద్భుత పెర్ఫామెన్స్. గతేడాది ఫిబ్రవరిలో రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆడిన 22 వన్డేల్లో 18.9 యావరేజ్, 4.72 ఎకానమీ రేట్‌తో 43 వికెట్లు సాధించాడు. తనిప్పుడు కెరీర్‌లో ఎప్పుడూ లేనంత మెరుగ్గా, సరికొత్తగా కనిపిస్తున్నాడు. దాంతో అంతా కుల్దీప్ 2.0 వెర్షన్ అంటున్నారు. ఈ కొత్త వెర్షన్ వచ్చే నెలలో స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో ప్రత్యర్థులను పడగొట్టేందుకు టీమిండియా ప్రధాన ఆయుధం కానుంది.