IND vs ENG, 2nd Test: ఒక్క సెషన్‌లో 5 వికెట్లు.. విజయానికి చేరువలో భారత్

IND vs ENG, 2nd Test: ఒక్క సెషన్‌లో 5 వికెట్లు.. విజయానికి చేరువలో భారత్

వైజాగ్ టెస్టులో ఇంగ్లాండ్ పోరాడుతుంది. ఓ వైపు వికెట్లు పడుతున్నా దూకుడుగా ఆడుతూ కష్టాల్లోకి పడింది. లంచ్ సమయానికి ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. క్రీజ్ లో కెప్టెన్ బెన్ స్టోక్స్ (0), వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ (0) ఉన్నారు. దీంతో వైజాగ్ టెస్ట్ లో భారత్ విజయం దిశగా దూసుకెళ్తుంది. ఇంగ్లాండ్ విజయం సాధించాలంటే మరో 205 పరుగులు చేయాలి. చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. కెప్టెన్ స్టోక్స్ , బెన్ ఫోక్స్ భాగస్వామ్యం పైనే ఇంగ్లాండ్ ఆశలు పెట్టుకుంది. 
  
వికెట్ నష్టానికి 67 పరుగులతో నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లాండ్ తొలి సెషన్ లో 127 పరుగులు జోడించింది. నైట్ వాచ్ మెన్ రెహన్ అహ్మద్ 23 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లో యల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత అశ్విన్ వరుస విరామాల్లో పోప్ (23) రూట్ (16) వికెట్లను తీసి మ్యాచ్ ను భారత్ వైపు తిప్పాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు ఓపెనర్ క్రాలి భారత బౌలర్లకు అడ్డుగా నిలిచాడు. బెయిర్ స్టో తో కలిసి భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.   
 
మరో 10 నిమిషాల్లో తొలి సెషన్ ముగుస్తుందనుకున్న సమయంలో కుల్దీప్ యాదవ్ హాఫ్ సెంచరీ (73) చేసిన క్రాలిని యల్బీడబ్ల్యూ గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత ఓవర్లో బెయిర్ స్టో ని బుమ్రా అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లు తీసుకోగా.. కుల్దీప్, బుమ్రా,అక్షర్ పటేల్ కు తలో వికెట్ లభించింది.