DC vs KKR: రింకూను రెండు సార్లు చెంపపై కొట్టిన కుల్దీప్.. ఢిల్లీ స్పిన్నర్‌పై ఫ్యాన్స్ ఫైర్

DC vs KKR: రింకూను రెండు సార్లు చెంపపై కొట్టిన కుల్దీప్.. ఢిల్లీ స్పిన్నర్‌పై ఫ్యాన్స్ ఫైర్

ఐపీఎల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ప్లేయర్లు సరదాగా మాట్లాడుకోవడం సహజం. కొంతమంది స్నేహితులు, సహచరులు వేరు వేరు జట్లకు ఆడినప్పుడు మ్యాచ్ తర్వాత తమ అనుభవాలను పంచుకుంటూ సంతోషంగా కనిపిస్తారు. ఆ క్షణం మ్యాచ్ గురించి మర్చిపోయి ఒకరికొకరు ఎంతో సాన్నిహిత్యంగా ఉంటారు. ఇక యువ ప్లేయర్లు అయితే సీనియర్ ఆటగాళ్ల దగ్గర విలువైన సలహాలు తీసుకుంటూ ఉంటారు. అయితే కొని సార్లు అత్యుత్సాహం వలన కొన్ని అనర్ధాలు తప్పవు. అలాంటి సంఘటన ఒకటి ఐపీఎల్ 2025లో చోటు చేసుకుంది.  

ఐపీఎల్ 2025 లో భాగంగా మంళవారం (ఏప్రిల్ 29) ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్  రింకూ సింగ్‌ను చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ను 14 పరుగుల తేడాతో ఓడించి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మ్యాచ్ తర్వాత ప్లేయర్లందరూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఆటగాళ్లు కుల్దీప్, రింకూ మాట్లాడుకుంటూ కనిపించారు. మధ్యలో కుల్దీప్ యాదవ్ రింకూ సింగ్ ను చెంపకు పెట్టి గట్టిగా బాదాడు. 

అప్పటి వరకూ నవ్వుతూ కనిపించిన రింకూ.. కుల్దీప్ చెంప దెబ్బ ధాటికి ఒక్కసారిగా ఫేస్ మార్చేశాడు. కొంచెం కోపం.. కొంచెం బాధగా ముఖం పెట్టాడు. వెంటనే మరోసారి కుల్దీప్ చెంపకు పెట్టి కొట్టడంతో ఈ విషయాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక అభిమాని  రింకును కుల్దీప్ అగౌరవపరిచాడని ఆరోపించగా.. మరొక అభిమాని " చైల్డిష్ బిహేవియర్" చేయొద్దని హెచ్చరించాడు. "ఇది సరదాగా సాగిన సంఘటనలా కనిపించడం లేదు. రింకు నవ్వినట్లు కనిపించకపోగా షాక్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ తనను నిరాశపరిచింది" అని  మరొక అభిమాని అన్నాడు.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే వరుస ఓటముల తర్వాత తీవ్ర ఒత్తిడిలో ఉన్న కేకేఆర్.. ఎట్టకేలకు మంగళవారం (ఏప్రిల్ 29) ఢిల్లీ క్యాపిటల్స్ పై 14 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో సమిష్టిగా రాణించడంతో పాటు బౌలింగ్ లో సునీల్ నరైన్ కీలక దశలో మూడు వికెట్లతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులకు పరిమితమైంది.