షిండేని బీజేపీ కూడా ఇష్టపడట్లే: వెనక్కి తగ్గని కునాల్ కమ్రా.. మరోసారి హాట్ కామెంట్స్

షిండేని బీజేపీ కూడా ఇష్టపడట్లే: వెనక్కి తగ్గని కునాల్ కమ్రా.. మరోసారి హాట్ కామెంట్స్

ముంబై: స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో అగ్గి రాజేశాయి. డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండేను ‘ద్రోహి’గా అభివర్ణించడంతో శివసేన కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఇప్పటికే కునాల్ ఆఫీసుపై దాడి చేసిన శివసేన కార్యకర్తలు .. కునాల్ కమ్రా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు శివసేన కార్యకర్తల ఫిర్యాదు మేరకు కునాల్ కమ్రాపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తానికి కునాల్ కమ్రా కామెంట్స్ ప్రస్తుతం మహారాష్ట్రలో హాట్ టాపిక్‎గా మారాయి. 

ఈ తరుణంలో తన వ్యాఖ్యలపై కునాల్ కమ్రా మరోసారి స్పందించారు. అందరూ కునాల్ తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గి క్షమాపణ చెబుతారని అనుకుంటే.. ఇందుకు విరుద్ధంగా రియాక్ట్ అయ్యాడు కునాల్. డిప్యూటీ సీఎం ఏక్‎నాథ్ షిండేను మరోసారి టార్గెట్ చేశాడు. 2025, మార్చి 25న కునాల్ మీడియాతో మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం ఏక్‎నాథ్ షిండేను మహారాష్ట్ర ప్రజలే కాకుండా.. తన మిత్రపక్షమైన బీజేపీ కూడా ఇష్టపడటం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

షిండేపై వ్యాఖ్యల తర్వాత తనను చంపుతామని, ముక్కలు ముక్కలుగా నరికివేస్తామని కనీసం 500 బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు. అయితే.. తనకు వచ్చిన అన్ని బెదిరింపు కాల్స్ శివసేన కార్యకర్తల నుండి మాత్రమే వచ్చాయి. బీజేపీ కార్యకర్తల నుండి ఒక్క కాల్ కూడా రాలేదు. ఇందుకే బీజేపీ కూడా మిస్టర్ షిండేను ఇష్టపడట్లేదు అని అనుకుంటున్నానని మరోసారి అగ్గి రాజేశారు కునాల్ కుమ్రా. సక్కగా సారీ చెబుతాడనుకుంటే.. తగ్గేదేలే అన్నట్లుగా మరోసారి షిండేపై హాట్ కామెంట్స్ చేశారు కునాల్. దీంతో షిండే, శివసేన కార్యకర్తలు ఎలా రియాక్ట్ అవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.