Kumar Sangakkara: ఇంగ్లాండ్ హెడ్ కోచ్‌గా సంగక్కర.. లంక దిగ్గజం ఏమన్నాడంటే..?

Kumar Sangakkara: ఇంగ్లాండ్ హెడ్ కోచ్‌గా సంగక్కర.. లంక దిగ్గజం ఏమన్నాడంటే..?

ఇంగ్లండ్ జట్టు హెడ్ కోచ్‌గా శ్రీలంక మాజీ కెప్టెన్, రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్ కుమార సంగార్కర బాధ్యతలు చేపట్టనున్నట్లు నివేదికలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ లో జోస్ బట్లర్‌తో అతనికున్న బలమైన సంబంధాల కారణంగా సంగక్కర పేరు తెరమీదకు వచ్చింది. ఇప్పటికే అతని పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ECB) అధికారిక ప్రకటన చేయనుందని సమాచారం. ఈ విషయంపై తాజాగా సంగక్కర స్పందించాడు. 

"ఇంగ్లాండ్ హెడ్ కోచ్ పదవి చాలా ఉత్తేజంతో కూడినది. ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. అయితే కోచ్ పదవి కోసం ఇంకా ఎవరూ నన్ను సంప్రదించలేదు.కొన్ని కారణాల వల్ల నా పేరు ప్రస్తావించబడిందని నాకు తెలుసు. అయితే ఎవరూ ఈ పదవి కోసం నా దగ్గరకు రాలేదు." అని ది హండ్రెడ్  లీగ్ సందర్భంగా స్కై స్పోర్ట్స్ తో సంగక్కర అన్నారు. సంగక్కర మాటలు చూస్తుంటే ఇంగ్లాండ్ క్రికెట్ ఆఫర్ ఇస్తే వెళ్లే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ALSO READ | SA20 2025: కెప్టెన్‌గా మార్కరం.. సన్ రైజర్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్లు వీరే

ఇంగ్లండ్ జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్ హెడ్ కోచ్‌ బాధ్యతల నుంచి మాథ్యూ మోట్ తప్పుకోగా.. అతని స్థానంలో తాత్కాలిక కోచ్‌గా ఆ జట్టు మాజీ క్రికెటర్ మార్కస్ ట్రెస్కోథిక్‌ను నియమించింది. కోచ్‌‌గా మాథ్యూ మోట్ పదవీ కాలం నాలుగేళ్లు కాగా, సగం దారిలోనే తప్పుకున్నాడు. 2022 మేలో బాధత్యలు చేపట్టిన మోట్.. కేవలం రెండున్నరేళ్లకే గుడ్ బై చెప్పాడు. ఇంగ్లండ్ పురుషుల జట్టుకు కోచ్‌గా పనిచేసినందుకు గర్వపడుతున్నానని అంటూ మోట్.. ఇన్నాళ్లు తనకు సహకరించిన ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్, ఇసిబిలోని ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.