కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ అడవుల్లో.. వన్యప్రాణులకు రక్షణ కరువు

  •     జనవరిలో రెండు  పెద్దపులులను చంపేశారు
  •     మరో నాలుగింటి  జాడ ఇంకా దొరకలేదు..!
  •     తాజాగా అనుమానాస్పద స్థితిలో ఎలుగుబంటి మృతి

ఆసిఫాబాద్/కాగజ్ నగర్, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ ఫారెస్ట్ ఏరియాలో  పులుల గాండ్రింపు వినబడడం లేదు. మిస్సైన రెండు పులుల జాడ ఇంకా తెలియరాలేదు. మిగతా వన్యప్రాణుల రక్షణ చూసే దిక్కు లేదు. వచ్చామా డ్యూటీ చేశామా వెళ్లమా అన్నట్లుగా ఇక్కడి ఫారెస్ట్ ఆఫీసర్లు, సిబ్బంది తీరు ఉండడంతో వన్యప్రాణులకు ఇది శాపంగా మారుతోంది.

ఇంత జరుగుతున్నా అటవీ శాఖ ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు తప్పితే దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో ‘కవ్వాల్ టైగర్ జోన్’లా కాగజ్​నగర్ ప్రాంతం తయారువుతుందని వన్యప్రాణి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉంటే ఉన్నట్టు.. పోతే పోయినట్టు..

కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ అడవుల్లో ఎప్పుడు ఏ ప్రాణి చనిపోతుందో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. అయిదు నెలల కిందట రెండు పెద్ద పులులు మృతి చెందగా.. అప్పటినుంచి ఒక్కొక్కటిగా లోపాలు బయటపడుతున్నాయి. అనేక అడవి జంతువులు ఇటీవల కాలంలో వేటగాళ్ల ఉచ్చులకు బలవుతున్నాయి. మృత్యువాత పడుతున్న జింకల, దుప్పిల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. వన్యప్రాణులు, మృగాలు చనిపోయినప్పుడు అధికారులు చేసే హడావుడికి రక్షణకు అసలు పొంతన ఉండడం లేదు. దీంతో కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ ఫారెస్ట్ లో వన్యప్రాణి మనుగడ ప్రశ్నార్థకమవుతోంది.

ఈ అడవుల్లో అమర్చిన ఉచ్చులు, భాస్వరం గుండ్లు, అడవిని ఆనుకుని ఉన్న పొలాల్లో కరెంటు తీగలకు వివిధ రూపాల్లో వన్యప్రాణులు బలవుతూనే ఉన్నాయి. కొన్నాళ్లుగా వన్యప్రాణుల వేట నిరాటంకంగా సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. అటవీ శివారు ప్రాంతాల్లోని రైతులు అడవి జంతువుల బారి నుంచి తమ పంటలను కాపాడుకోవడానికి విద్యుత్‌‌‌‌ తీగలు అమర్చుతున్నారు. మేత, నీటి కోసం వస్తున్న వన్యప్రాణులు ఆ తీగలకు తగిలి మృత్యువాత పడుతున్నాయి. ఫలితంగా రోజురోజుకీ వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోతోంది. 

వైల్డ్ లైఫ్ మానిటరింగ్ ఎక్కడుందో..  

కాగజ్ నగర్ డివిజన్ లో వన్యప్రాణులకు కొదవలేదు. వాటి రక్షణే కరువుతోంది. వైల్డ్ లైఫ్ మానిటరింగ్ కోసం వాడాల్సిన వాహనం మూడు నెలలుగా మూలకు పడి ఉండడంతో పరిస్థితికి అద్దం పడుతోంది. వైల్డ్ ఎనిమల్స్ మానిటరింగ్ కోసం కాగజ్ నగర్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ను నియమించిన ప్రయోజనం లేదు. వందలాది సీసీ కెమెరాలు పెట్టినా, 200 మంది సిబ్బంది, అధికారులు ఉన్నా కనీస రక్షణ పకడ్బందీగా లేకపోవడం దురదృష్టం. కాగజ్ నగర్ డివిజన్ లో ఉన్న పులులు చాలా వరకు మహారాష్ట్ర కు వెళ్లినట్లు సమాచారం.

ఇటీవల జరిగిన పులుల విష ప్రయోగం ఘటన తర్వాత అదే తరహాలో మరిన్ని ఘటనలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా పెంచికల్ పేట మండల సమీపంలోని అగర్ గూడ అడవుల్లో ఎలుగు బంటి కళేబరాన్ని గురువారం అధికారులు గుర్తించారు. ఎలుగు బంటిపై దాడి చేసినట్లుగా గాయాలు ఉన్నాయి. ఈ ఘటనలో ఉచ్చులు పెట్టారా? కరెంట్ షాక్ తో హతమర్చారా? లేక విషప్రయోగం చేశారా? అన్నది తేల్చేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు ఎలుగుబంటి శరీర భాగాలను పంపారు.

గురువారం రాత్రి కాగజ్ నగర్ సిర్పూర్ మేన్ రోడ్ పై చుక్కల దుప్పి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందింది. జనవరిలో రెండు పులుల మృతి చెందిన తర్వాత.. తమ అడవిలో పులులు లేకుంటేనే బెటర్ అని, ఎటువంటి టెన్షన్ లేకుండా డ్యూటీ చేసుకోవచ్చని సిబ్బంది, అధికారులు  ఆలోచన  చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

అప్పటినుంచి ఇప్పటివరకు రెండు పెద్ద పులులు, వాటి రెండు పిల్లలు కనిపించడం లేదు.ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి పులులు సహా వన్య ప్రాణుల రక్షణ కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

జాడ లేని పులుల కోసం ట్రాకింగ్ చేస్తున్నాం..

కాగజ్ నగర్ డివిజన్  లో రెండు పులుల మృతి ఘటనలో ఓ పులి ఫోరెన్సిక్ నివేదిక అందింది. అది టేరిటోరియల్ ఫైట్ లో చనిపోయిందని వచ్చింది. రెండో పులి రిపోర్ట్ రావాల్సి ఉంది. మిగిలిన నాలుగు పులుల జాడ కోసం ట్రాకింగ్ చేస్తున్నాం. మహారాష్ట్రకు వెళ్లినట్లు అనుమానిస్తున్నాం. చుక్కల దుప్పి చనిపోయింది రెవెన్యూ జాగాలో. ఎలుగు బంటి శరీర భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాం.

నీరజ్ కుమార్ టీబ్రేవాల్,జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్