రేపటితో(ఫిబ్రవరి26) కుంభమేళా లాస్ట్..శివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు​

రేపటితో(ఫిబ్రవరి26) కుంభమేళా లాస్ట్..శివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు​
  • శివరాత్రి కోసం అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు
  • ఇప్పటి దాకా 62 కోట్ల మందికి  పైగా భక్తుల స్నానాలు

మహాకుంభనగర్ (యూపీ): ప్రయాగ్​రాజ్​లో జరుగుతున్న మహా కుంభ మేళా ముగింపుకు రెండు రోజులే మిగిలి ఉండటంతో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భారీ సంఖ్యలో భక్తులు త్రివేణి సంగమానికి తరలివస్తున్నారు. ఇప్పటి వరకు 62 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ప్రతి రోజూ కోటి మందికి పైగా భక్తులు స్నానాలు చేస్తున్నారు. 

బుధవారం మహా శివరాత్రి కావడంతో భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. ఈ మేరకు యూపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. తొక్కిసలాట జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది. ప్రయాగ్​రాజ్​లో సుమారు 30 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. కాగా, సోమవారం పలువురు సినీ ప్రముఖులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. 

సినీ నటి కత్రినా కైఫ్.. తన అత్తయ్య వీనా కౌశల్​తో కలిసి త్రివేణి సంగమానికి వచ్చారు. గంగాదేవికి ప్రత్యేక పూజలు చేసి పుణ్య స్నానం చేశారు. అనంతరం స్వామి చిదానంద సరస్వతి, సాధ్వి భగవతి సరస్వతిని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. నటుడు అక్షయ్ కుమార్ కూడా త్రివేణి సంగమంలో పుణ్య స్నానమాచరించారు. మేళా ఏర్పాట్లపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ను అభినందించారు.

ప్లీజ్.. ప్రయాగ్​రాజ్​కు రాకండి

పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ప్రయాగ్​రాజ్ వాసులు చేస్తున్న రిక్వెస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ‘‘మీకు దండం పెట్టి చెప్తున్నాం.. దయచేసి ప్రయాగ్​రాజ్ కు రాకండి. రోజువారీ పనులు చేసుకోవడానికి మేము నానా కష్టాలు పడ్తున్నం. 

మేళా అయిపోయాక తీరిక చూసుకొని రండి’’ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. కాగా, త్రివేణి సంగమంలో స్నానాలు, బట్టలు మార్చుకుంటున్న మహిళల వీడియోలు తీసి అప్​లోడ్ చేసిన 140 సోషల్ మీడియా చానెల్స్​పై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు.