గురువు 22.03.2023 నుంచి 21.04.2023 వరకు ద్వితీయంలోనూ, తదుపరి 08.04.2024 ఉగాది వరకు తృతీయ స్థానమందు సంచారం. శని 22.03.2023 నుంచి 08.04.2024 వరకు జన్మ స్థానంలో సంచారం. రాహువు 22.03.2023 నుంచి 30.10.2023 వరకు నవమ స్థానంలోను, తదుపరి ఉగాది వరకు నవమ స్థానంలో సంచారం. కేతువు 30.10.2023 నుంచి తదుపరి ఉగాది వరకు అష్టమ స్థానంలో కలహామూర్తిగా సంచారం.
ఈ రాశి స్త్రీ పురుషులకు అనుకూలం. అనేక విధాలుగా సాహసాలు చేయగలిగితేనే రాణిస్తారు. రైతు సోదరులకు అనుకూలంగా ఉంటుంది. డాక్టర్లకు, లాయర్లకు ఆకస్మిక ధన సంపద ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగస్తులకు అనుకూలం. లంచం తీసుకునే ఉద్యోగులపైన ఏసీబీ దాడులు జరుగును. కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులు సామరస్య ధోరణి కలిగి ఉండాలి. జయం మీ పక్కనే ఉంటుంది. చాలా చాకచక్యంగా వినయవిధేయతలతో ప్రజాసేవలో ఉన్నవారికి అనుకూలం. వెండి, బంగారం, కాపర్, సుగంధద్రవ్యాలు, స్టీలు, సిమెంట్, టింబర్ ధరలు నిలకడగా ఉండవు. నూతన వ్యాపారం వారికి కొన్ని విధాలుగా అవరోధాలు కలుగును. చిన్న, పెద్ద పరిశ్రమల వారికి అధిక లాభాలు. పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, పౌల్ట్రీ వారు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటే, లాభాల బాటలో ఉంటారు. షేర్స్, ఫైనాన్స్, చిట్స్ అటుఇటుగా ఉండగలవు. వీరికి ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో అర్థం కాదు. అలాగని ఏమీ చేయలేని స్థితిలో ఉన్నదాని కంటే కొత్తగా ట్రై చేస్తారు. టెక్నికల్‌గా ఉన్నవారికి ఆదాయ వనరులు అధికంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మానసిక ఒత్తిడి ఫీలవుతారు. కారణం శని గ్రహం వక్రంలో జూన్ నుంచి నవంబర్ మధ్యలో తెలియని విధంగా కొన్ని సమస్యలు. మీరు ఈ రోజుల్లో మహాన్యాస రుద్రాభిషేకం, శనికి తైలాభిషేకం, శ్రీవెంకటేశ్వరస్వామి వారికి అలంకరణ, చక్కెర పొంగలి ప్రసాదం సమర్పించగలరు. విద్యార్థులు మొబైల్ ఫోన్ చూసే విషయంలో పంతం పట్టుదలకు పోకుండా శ్రద్ధగా చదువుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. కష్టపడి, ఇష్టంగా ఎవరైతే పనిచేస్తారో వారికి అనుకూలంగా ఉంటుంది . కంటి సంబంధిత సమస్యలు రావొచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోగలరు. కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి ఆదాయ వనరులు అధికం. ధనిష్ట నక్షత్రం వారు పగడం ధరించాలి. సుబ్రమణ్యేశ్వర స్వామిని పూజలు చేయాలి. శతబిష నక్షత్రం వారు గోమేధికం ధరించాలి. దుర్గాదేవికి పూజలు, కుంకుమ పూజలు తప్పనిసరిగా చేయాలి. పూర్వాభాద్ర నక్షత్రం వారు కనకపుష్య రాగం ధరించాలి. దక్షిణామూర్తికి పూజలు, సాయిబాబాకు పూజలు చేయాలి. శనగ గుగ్గిళ్లు చేసి సాయిబాబా దేవాలయంలో పంచాలి. గురు కృప కలిగితేనే మీరు చేసే వ్యాపారాల్లో అనుకూలత. ఆకస్మిక సమస్యలు మీ చుట్టూ ఉచ్చులాగా ఉంటాయి. దీని నుంచి బయటపడాలంటే గురు బలం ఉంటేనే సాధ్యమవుతుంది. దుర్గాదేవి మహత్యం వల్ల బయటకు రావడానికి వీరి సహాయం తప్పనిసరిగా అవసరం అవుతుంది. ఎందుకంటే మీరు అల్ప సంతోషులు. అన్ని విషయాలను అందరికి చెప్తారు. దాపరికం లేదు.. ఇదే మీ కష్టాలకు ప్రధాన కారణం. మీ దగ్గర, మీ చుట్టుపక్కల ఉన్న వారు మీకు సమస్యలు తీసుకొని రాగలరు. మీరు ఏకాగ్రత కలిగి పట్టు వదలని విక్రమార్కుడిగా ఉండాలి. పట్టుకొని కూర్చోగలిగితే మీకు మీరు సాటి అని చెప్పవచ్చు. అదృష్ట సంఖ్య 8.
కుంభ రాశి మాస ఫలితాలు
చైత్ర మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా చక్కటి ప్లానింగ్ చేసుకోవటం వలన స్థలం కొందామా? ఫ్లాట్ కొందామా? పొలం కొందామా? అని ప్లాన్ చేసుకుంటుంటారు. ఆభరణాల విషయంలో తొందరపాటు లేకుండా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆర్భాటం లేకుండా ప్లాన్ చేయండి.
వైశాఖ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యంగా ఉంటుంది. మీరు చేయు వృత్తి వ్యాపారాల్లో ఆకస్మిక ధన లాభం సూచనలు. ఏ మాత్రం ఆదమరిచినా వచ్చేది రాకపోవుట లేక ఏదో ఒకరకంగా బ్రేక్ పడటం జరుగుతుంది. నవగ్రహ ప్రదక్షిణలు, జపాలు, దానాలు చేయడం మంచిది.
జ్యేష్ఠ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు బంధు మిత్రుల కలయిక, విందు వినోదాలతో సంతోషంగా ఉంటారు. ఆకస్మిక ప్రయాణాలతో తెలియని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మంచి శకునాలు చూసి ప్రయాణాలు చేయండి. ఆర్థిక విషయాల్లో తెలియని లాభాలు. గురు పూజలు చేయడం వలన మంచి జరుగుతుంది. మృత్యుంజయ జపం ప్రయాణములలో చేయండి.
ఆషాఢ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు చాలా అనుకూలం. మీరు వెళ్లిన పనులు నెరవేరగలవు. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు ఉంటుంది. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరాదు. ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకోండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని మెలకువలు పాటించండి. దక్షిణామూర్తిని ఆరాధించండి.
అధిక శ్రావణ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు నిర్లక్ష్యం పనికిరాదు. మొహమాటం కొద్ది ఎట్టి పరిస్థితుల్లో సాక్షి సంతకం చేయొద్దు. జాయింట్ వ్యవహారాల్లో అన్యోన్యంగా ఉండండి. ఆకస్మికంగా కలహాలు రావొచ్చు. తక్కువగా మాట్లాడండి. మీ ఓర్పే మీకు రక్ష. శ్రీసత్యదేవుని వ్రతం చేయండి.
నిజ శ్రావణ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టకార్యాలు నెరవేరుతాయి. బంధుమిత్రుల కలయికతో సంతోషంగా ఉంటారు. తొందరపాటు వలన అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఏకాగ్రత వలన అనేక విధాలుగా ధన లాభం ఉంది.
భాద్రపద మాసం: ఈ రాశి స్త్రీ పురుషులు శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన లాభం. వినయవిధేయులుగా ఉండండి. మీ టాలెంట్‌కు ఇది పరీక్ష కాలం. విఘ్నేశ్వర పూజలు చేయడం వలన ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు. మీ అవసరాల కోసం డబ్బును అంతగా ఖర్చు పెట్టరు. ఖర్చులు కొంచెం తగ్గుతాయి. నిత్యదీపారాధన చేయండి.
ఆశ్వయుజ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు కొన్ని రకాల సమస్యలు. దుర్గా దేవి పూజలు చేయడం వలన సమస్యలు వచ్చినా, పరిష్కారం అవుతాయి. కోపాలకు ఇది సమయం కాదు. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం తగదు. సుదర్శన హోమం చేయండి.
కార్తీక మాసం: ఈ రాశి స్త్రీ పురుషులు చాలా విషయాల్లో ఊగిసలాడుకుంటూ ఉంటారు. ఏదీ తెలుసుకోలేరు. డబ్బు ఇచ్చిపుచ్చుకోవడంలో చాలా మెలకువలు పాటించాలి. ఇంట్లో అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సాయినాథుని ఏక నామం పఠించండి.
మార్గశిర మాసం: ఈ రాశి స్త్రీ పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎవరికైనా డబ్బులు ఇస్తే, అవి తిరిగి రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. విమర్శలకు చోటు ఇవ్వొద్దు. అధిక ప్రేమ, అనవసర విషయాల వలన తెలియని సమస్యలు వస్తాయి. నిరాశ నిస్పృహలకు లోనవుతారు. నవగ్రహ ఆరాధన చేయండి.
పుష్య మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు అనుకూలంగా ఉంటుంది. విందువినోదాలు, దూరప్రయాణాల్లో చాలా అలర్ట్‌గా ఉండాలి. తగాదాలకు, మాటపట్టింపులకు ఇది సమయం కాదు. ఓర్పు, నేర్పుతో సమస్యలు పరిష్కరించుకోవాలి. శనికి తైలాభిషేకం చేయండి.
మాఘ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులు అనేక విధాలుగా ఆనందంగా ఉంటారు. అనుకోని కలహాలు వస్తాయి. చాలా ఓర్పు, నేర్పుతో సమన్వయం కలిగి పరిష్కరించుకోవాలి. దూర ప్రయాణంలో లాభం ఉన్నది. నిర్లక్ష్యంగా ఉండరాదు. మిమ్మల్ని మోసం చేయగలరు. శనివారం ఆంజనేయస్వామి వారి పూజలు చేయండి. అలాగే 11 ప్రదక్షిణలు చేయాలి.
ఫాల్గుణ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు ఆకస్మిక ధన లాభం ఉంది. పాత బాకీలు తీరుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించును. పెద్దల మన్ననలు, సంఘంలో కీర్తి ప్రతిష్టలు, ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటారు. మనఃశ్శాంతి ఉంటుంది. సంతోషంగా ముందుకు సాగండి. శ్రీహరి అలంకరణ, చక్కెర పొంగలి ప్రసాదం చేసి దేవునికి నైవేద్యంగా పెట్టాలి.