- ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ పై కుంభం ఫైర్
భూదాన్ పోచంపల్లి, వెలుగు : భూదాన్ పోచంపల్లి మండలంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అభివృద్ధి చేయలే కానీ, ప్రభుత్వ ఆస్తులు అమ్ముకున్నారని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని పలు వార్డులలో ఆయన పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మున్సిపాలిటీ కేంద్రంలో కేవలం సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేస్తూ అదే అభివృద్ధి అని ఎమ్మెల్యే పైళ్ల చెప్పుకుంటున్నారని, ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయని తెలిపారు.
మున్సిపాలిటీ కేంద్రంలో రూ.30 కోట్ల ప్రభుత్వ భూమిని బీఆర్ ఎస్ నాయకులు అమ్ముకుంటే ఇంతవరకు వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదో ఎమ్మెల్యే చెప్పాలని డిమాండ్ చేశాడు. భూదాన్ పోచంపల్లి చెరువును మినీ ట్యాంక్ బండ్ చేస్తానని చెప్పి చేయకపోగా , చెరువును ఎండబెట్టి మట్టిని అమ్ముకొని సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. దశాబ్ది ఉత్సవాల పేరిట తెలంగాణ ప్రభుత్వం ప్రజలను దగా చేస్తోందని, వీటిని ప్రజల ముందు ఉంచడానికి 22న భువనగిరిలో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నామని చెప్పారు.