యాదాద్రి, వెలుగు: భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ గెలుస్తుందనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థి అని అందరూ భావించారు. కానీ, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో విభేదాల కారణంగా పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. భువనగిరి టికెట్ వస్తుందని భావించారు. అనూహ్యంగా సీఎం కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే పైళ్ల రాజశేఖర్ రెడ్డికే టికెట్ ఇవ్వడంతో అనిల్ కుమార్ రెడ్డి నారాజ్ అయ్యారు. దీంతో కాంగ్రెస్ సీనియర్ లీడర్లు అనిల్‌ను మళ్లీ కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టారు. తాజాగా మాజీ మంత్రి జానారెడ్డి.. అనిల్‌కుమార్‌కు ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం.
కాంగ్రెస్‌లోకి తిరిగి వస్తే టికెట్ ఇప్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. కన్స్ట్రక్షన్ బిజినెస్‌లో ఉన్న అనిల్ కుమార్ రెడ్డి.. ఇటీవల కర్నాటక వెళ్లి వచ్చారు. అక్కడ అనిల్.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిసినట్టు ప్రచారం జరుగుతున్నది. దీంతో ఆయన మళ్లీ కాంగ్రెస్‌లో చేరుతున్నారని, భువనగిరి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటిని అనిల్ కుమార్ రెడ్డి ఖండించినప్పటికీ.. జానా రెడ్డి ఫోన్ నేపథ్యంలో చర్చనీయాంశంగా మారింది.