యాదాద్రి, వెలుగు: యాదాద్రి డీసీసీ ప్రెసిడెంట్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎట్టకేలకు బీఆర్‌ఎస్‌లో చేరారు. కొన్నాళ్లుగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీరును ఆయన వ్యతిరేకిస్తున్నారు. మొదటి నుంచీ వీరిద్దరి మధ్య సఖ్యత లేదు. 2018 ఎన్నికల్లో వెంకట్‌రెడ్డి అనుచరులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి సపోర్ట్ చేయడం వల్లే తాను ఓడిపోయానని కుంభం మనసులో ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా వెంకట్‌రెడ్డి గెలిచిన తర్వాత వీరిద్దరి మధ్య గ్యాప్పెరిగింది. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ఎంపికయ్యాక కుంభం పలు సందర్భాల్లో కేడర్‌ను తీసుకొని వెళ్లి కలిసి వచ్చారు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు మరింత ముదిరాయి. భట్టి విక్రమార్క పాదయాత్ర ఆలేరుకు చేరుకున్న టైంలో అనిల్‌కుమార్‌రెడ్డికి ఎంపీ అనుచరుడు, ఆలేరు ఇన్చార్జి బీర్ల అయిలయ్య కనీసం మైక్ ఇవ్వకుండా అవమానించాడు. ఇటీవల భువనగిరికి చెందిన పలువురు లీడర్లు ఘట్కేసర్లో మీటింగ్ ఏర్పాటు చేసుకొని కుంభంపై అసమ్మతి ప్రకటించారు. ఈసారి భువనగిరి అభ్యర్థిగా బీసీకి అవకాశం ఇవ్వాలని ప్రకటన విడుదల చేశారు.
ఉదయం మీటింగ్.. సాయంత్రం జంప్..
వరుస పరిణామాలతో అసహనానికి గురైన అనిల్‌కుమార్ రెడ్డి సోమవారం ఉదయం భువనగిరి సెగ్మెంట్లోని 4 మండలాల ముఖ్య కార్యకర్తలతో మీటింగ్ నిర్వహించి, ఎంపీ వెంకట్‌రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీ తీరుతో భువనగిరిలో పార్టీకి నష్టం జరుగుతున్నదని ఆరోపించారు. ఇలా అయితే పార్టీలో కొనసాగడం కష్టమని తేల్చి చెప్పారు. మీటింగ్ ముగియగానే అనుచరులతో మంత్రి జగదీశ్‌రెడ్డి వద్దకు వెళ్లి, అక్కడి నుంచి ప్రగతిభవన్చేరుకున్నారు. అప్పటికే అక్కడ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఉన్నారు. అనంతరం అనిల్‌కుమార్‌రెడ్డికి సీఎం కేసీఆర్ కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. నిజానికి తనకు దూరపు బంధువైన అనిల్‌కుమార్‌రెడ్డిని బీఆర్ఎస్లోకి తీసుకురావడానికి మంత్రి జగదీశ్‌రెడ్డి 2021 నుంచి ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇప్పిస్తానని హామీ కూడా ఇచ్చారు. అదే సమయంలో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించడంతో ఎమ్మెల్యే కోటాలో ఆయనను భర్తీ చేశారు. దీంతో కుంభం చేరిక వాయిదా పడింది. ఎంపీ వెంకట్‌రెడ్డితో సంబంధాలు మరింత దెబ్బతినడం, మంత్రి నుంచి పలుమార్లు ఆహ్వానం రావడంతో చివరకు కుంభం బీఆర్‌ఎస్‌లో చేరారు.