![కుంభమేళా ప్రమాదం.. హైదరాబాద్కు చేరుకున్న మృతదేహాలు.. అంత్యక్రియలు అక్కడే..](https://static.v6velugu.com/uploads/2025/02/kumbhmela-accident-dead-bodies-reached-hyderabad-and-families-demands-exgratia_SH7Zwiam26.jpg)
మహాకుంభమేళా వెళ్లి తిరిగొస్తూ ప్రమాదంలో చనిపోయిన నాచారం వాసుల మృతదేహాలు బుధవారం హైదరాబాద్ నగరానికి చేరుకున్నాయి. మొదట గాంధీ ఆస్పత్రికి తీసుకు వచ్చి పోస్ట్ మార్టం నిర్వహించారు. మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు ప్రభుత్వం 6 అంబులెన్స్ లు ఏర్పాటు చేసింది. పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అందజేశారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు.
ప్రమాదంలో మృతి చెందిన నాచారం వాసులు మల్లారెడ్డి, సంతోష్, రవికుమార్, శశికాంత్, డ్రైవర్ రాజు ల చిత్రపటాలకు కార్తికేయ నాగర్ కాలనీ వాసులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ..
మృతులలో ఒకరైన ఆనంద్ కుమార్ చారి మృతదేహం వివేకానంద నగర్ లోని తన నివాసం చేరుకుంది. దీంతో ఆనంద్ కుమార్ చారి నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆనంద్ చారి పార్థివ దేహానికి స్థానిక గడ్డిన్నారం కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పూల వేసి నివాళులు అర్పించారు.
మరో మృతుడు నాచారం కార్తికేయ నగర్ మల్లారెడ్డి మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడంతో కుటుంబసభ్యులు, కాలనీ వాసులు ధీనంగా రోధిస్తున్నారు.
అదే విధంగా డ్రైవర్ రాజు అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ సమీపంలోని మరిపెడ బంగ్లా లో నిర్వహించనున్నారు . రాజు మృతదేహాన్ని నాచారం ఎర్రకుంట లోనీ ఆయన ఇంటి వద్ద నుంచి మరిపెడ బంగ్లా కు తరలిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
మరో మృతుడు రవికుమార్ మృతదేహాన్ని నాచారం కార్తికేయ నగర్ లోని సాయి జ్యోతి అపార్ట్మెంట్ కు తరలించారు. రవికుమార్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు,కాలనీవాసులు తీవ్రంగా కన్నీటి పర్యంతమయ్యారు.
మృతదేహాలను అంత్యక్రియల నిమిత్తం మల్లాపూర్ స్మశాన వాటిక కు తరలించారు. డ్రైవర్ రాజు మృతదేహానికి తన స్వగ్రామంలో అంత్యక్రియలు జరపున్నారు.
ప్రయాగ్ రాజ్ కుంభమేళా వెళ్లి తిరిగి వస్తూ చనిపోయిన మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.