శ్రీశైలంలో సంప్రదాయబద్దంగా కుంభోత్సవం

శ్రీశైలంలో సంప్రదాయబద్దంగా కుంభోత్సవం

శ్రీశైలం: అష్టాదశ శక్తిపీఠం.. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం.. భూ కైలాస గిరి అయిన శ్రీశైల క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ దేవికి కుంభోత్సవం సంప్రదాయబద్దంగా జరిగింది. ఏటా చైత్ర మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళ లేదా శుక్రవారాల్లో(ఏ రోజు ముందుగా వస్తే ఆరోజు) అమ్మవారికి సాత్విక బలిని సమర్పించేందుకు ఈ కుంభోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ప్రతిసారి వైభవంగా భక్తాదుల సన్నిధిలో నిర్వహించేవారు. అయితే ఈసారి గత ఏడాది మాదిరిగినే కరోనా మహమ్మారి వల్ల కేవలం ఆలయ ఈఓ కె.ఎస్ రామారావు ఆధ్వర్యంలో దేవస్థానం ప్రధాన అర్చకులు, ముఖ్య పూజారులతో కలసి సాత్విక బలి నిర్వహించారు. ఈ ఉత్సవంలో భాగంగా గుమ్మడికాయలు, కొబ్బిరికాయలు, నిమ్మకాయలు, అన్నపురాశి మొదలైనవి అమ్మవారికి సమర్పించారు. ముందుగా సంప్రదాయం ప్రకారం ఉదయమే అమ్మవారి ఆలయంలో రజకునిచేత ప్రత్యేక రంగవల్లిని వేయించారు. అనంతరం అర్చక స్వాములు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ఉత్సవ సంకల్పాన్ని పఠించారు. సకాలంలో వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని, అతి వృష్టి, అనావృష్టి, అగ్ని ప్రమాదం, వాహన ప్రమాదాలు లేకుండా జనులందరికీ ఆయురారోగ్యాలు కలగాలని కాంక్షించారు. అలాగే జనాలకు కీడు చేసే సూక్ష్మాంగ జీవులు (వైరస్) వ్యాప్తి చెందకుండా నశించాలని, జనం అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని, కరోనా విపత్కర పరిస్థితులు తొలగి పోవాలని కోరుకుంటూ సంకల్పం నిర్వహించారు. కుంభోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం ప్రాతఃకాల పూజల అనంతరం అమ్మవారికి అర్చకులు నవావరణ పూజ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర కుంకుమ పూజలను, జపపారాయాణలను నిర్వహించారు. 
కొబ్బరికాయలు, గుమ్మడి కాయల సమర్పణ
కరోనా నేపధ్యంలో అమ్మవారి సేవలన్నీ ఏకాంతంగా జరిపించారు. పూజాదికాల అనంతరం కొబ్బరికాయలు, గుమ్మడి కాయలు, నిమ్మకాయల రాశులను సాత్విక బలిగా సమర్పించారు. అనంతరం హరిహర రాయ గపుర ద్వారం వద్ద గల మహిషాసురమర్ధిని అమ్మవారికి (కోటమ్మ వారికి) ప్రత్యేక పూజాదికాలను జరిపించి సాత్విక బలిగా కొబ్బిరికాయలు, గుమ్మడికాయలు సమర్పించారు. ఉత్సవాలలో భాగంగా శ్రీ మల్లికార్జునస్వామి వారికి ప్రదోషకాల పూజల అనంతరం అన్నాభిషేకం జరిపించారు. సింహ మండపం వద్ద అన్నాన్ని కుంభ రాశిగా వేయడం జరిగింది. తరువాత సంప్రదాయాన్ని అనుసరించి స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభ హారతిని సమర్పించడంతో ఉత్సవంలోని ప్రధాన ఘట్టం ప్రారంభమైంది. అనంతరం రెండో విడుత సాత్విక బలిగా కొబ్బరికాయలు సమర్పించారు.
మహానివేదిన
కుంభోత్సవంలోని ప్రధాన ఘట్టాల అనంతరం చివరగా అమ్మవారికి పునః పూజలు చేసి పలు రకాల వంటకాలతో అమ్మవారికి మహానివేదన జరిపించారు. అలాగే గ్రామ దేవత అంకాళమ్మకు కూడా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకంలో ఉండే అనారోగ్య పరిస్థితులు తొలగిపోవాలని అర్చకులు పూజలు నిర్వహించారు.