- అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
- గొంతు నులిమినట్టు ఆనవాళ్లు
- కాగజ్‌నగర్‌లో ఘటన
కాగజ్‌నగర్, వెలుగు: రాత్రి కనిపించకుండా పోయిన ఓ మహిళ తెల్లవారుజామున ఇంటి సమీపంలోని పెరట్లో శవమై కనిపించింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం ఈస్ గాం పోలీస్ స్టేషన్ పరిధిలోని గన్నారం మండువ గ్రామానికి చెందిన కమ్మరి గణపతి- కమల దంపతుల కూతురు రోజ(25)కు ఐదేండ్ల కింద పెండ్లయ్యింది. ఓ పాప పుట్టి చనిపోయింది. కుటుంబ కలహాల నేపథ్యంలో రోజా మూడేండ్ల క్రితం విడాకులు తీసుకొని తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఆమె తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్లి బుధవారం రాత్రి తిరిగి వచ్చేసరికి రోజా ఇంట్లో కనిపించలేదు.
కుటుంబీకులు, స్థానికులు రాత్రంతా వెతికినా ఆచూకీ దొరకలేదు. తెల్లవారుజామున ఇంటి సమీపంలోని పెరట్లో ఉన్న పొదల్లో రోజా డెడ్‌బాడీని గుర్తించారు. ఆమె గొంతు నులిమినట్లు ఆనవాళ్లు కనిపించడంతో హత్యగా అనుమానిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ నాగరాజు తెలిపారు. కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.