చరిత్ర మరవని యోధుడు కొమురం భీం

ఏటా ఆశ్వయుజ మాసంలో శుద్ధపౌర్ణమి రాగానే గోండు గిరిజన గూడేల్లో సందడి నెలకొంటుంది. ఆదివాసీల ఆచారం ప్రకారం గొప్ప పోరాట వీరుడైన కొమురం భీం వర్ధంతిని ఈ పౌర్ణమి సందర్భంలోనే నిర్వహిస్తారు. తెలంగాణ యోధుడు కుమ్రంభీం అమరత్వం పొంది 2022, అక్టోబర్ 8 నాటికి 82 ఏండ్లు దాటింది. నిజాం నవాబులపై భీం దాదా పోరాట స్ఫూర్తి తెలంగాణకే కాదు. యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అప్పటి వాస్తవ పరిస్థితుల ఆధారంగా అట్టడుగు వర్గాల చరిత్ర, జీవన విధానం, సంస్కృతి, ఆచారాలను సినిమాగా తీసిన సందర్భాలు అరుదుగా కనిపిస్తుంటాయి. ఆ కోవలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గోండు గిరిజనుల ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలను ఆవిష్కరిస్తూ అడవి బిడ్డల హక్కులైన ‘జల్, జంగల్, జమీన్ హమారా’ నినాదం కోసం ప్రాణాలర్పించిన ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం పోరాట గాధను ‘కొమరం భీం’ చిత్రంగా ప్రభుత్వమే 1990లో తెరకెక్కించింది. అది1991లో నంది అవార్డును సొంతం చేసుకుంది. నాటి నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల ఆగడాలను అవలీలగా ఎదుర్కొంటూ ఆదివాసీలకు స్వయం పాలన నినాదంతో 1937 నుంచి1940 వరకు వీరోచితంగా సాగిన ‘జోడేఘాట్ తిరుగుబాటు’ ఉద్యమం మహోజ్వల చరిత్రంగా నిలిచింది. తెలంగాణ విముక్తి కోసం నిజాం నవాబులను ఎదిరించిన కొమురం భీం దేశం గర్వించదగిన మహాయోధుడు. 

నిజాంల గుండెల్లో సింహస్వప్నం

ప్రపంచ చరిత్రలో ఆదివాసీల పోరాటాలు అపూర్వమైనవి. అవన్నీ భూమికోసం, భుక్తి కోసం, స్వయం పాలన కోసం జరిగినవి. కొండ కోనల్లో ప్రకృతితో సహజీవనం సాగించే గిరిపుత్రులకు అడవిపై హక్కు వారి సామాజిక న్యాయం. భారత దేశానికి ఆంగ్లేయుల రాకపూర్వమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల పరిధిలో క్రీ. శ.1240 నుంచి క్రీ. శ.1749 మధ్య గోండ్వానా రాజ్యంగా ఏర్పడ్డాయి. గోండు గిరిజనుల్లో తొలి వీరుడైన రాంజీ గోండ్ తెల్లదొరల దమన నీతిని ఖండిస్తూ1836 నుంచి 1860 వరకు వీరోచితంగా పోరాడాడు. గోండ్వానాలో అంతర్భాగమైన ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల ఆదివాసీ ప్రజలు నిజాం నిరంకుశ పాలనలో నిర్బంధాలకు గురయ్యారు. రాంజీగోండ్ వారసత్వం పుణికి పుచ్చుకున్న మరో గిరిజన నాయకుడు కుమ్రంభీం. తెలంగాణ సాయుధ పోరులో ఒక రంగల్ జెండా. ఆదిమ జాతుల వారికి స్వయం పాలన దక్కాలని 1937 నుంచి 1940 దాకా నిజాం నవాబులపై రణభేరి మోగించి, నిజాంల గుండెల్లో సింహస్వప్నంగా మారాడు. 

జోడేఘాట్ ​నుంచి..

కొమురం భీం పూర్వ ఆదిలాబాద్ జిల్లా కెరిమెరి మండలం సంకేపల్లిలో 1901, అక్టోబర్ 22న జన్మించాడు. చిన్నతనంలోనే అటవీ సిబ్బంది చేసిన దాడిలో తండ్రిని కోల్పోయాడు. తర్వాత భీం కుటుంబం సుర్దాపూర్ గ్రామానికి మారింది. తనకు వారసత్వంగా వచ్చిన పోడు భూమిని సాగుచేసుకుంటున్న తరుణంలో నిజాం అనుయాయుడు ‘సిద్దిక్’ అనే జాగీర్దార్ ఆ భూమిని దురాక్రమణ చేయడంతో భీంకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రజాకార్లు గోండులతో వెట్టిచాకిరి చేయించే వారు. స్త్రీలపై అత్యాచారాలు, వస్తు దోపిడీ వంటి ఆరాచకాలకు పాల్పడ్డారు. వస్తు మార్పిడి తప్ప డబ్బు కండ్లజూడని అమాయక ఆదివాసులు అడవుల్లో పశువులను మేపినా, పొయ్యి కట్టెలు తెచ్చుకున్నా, బంబరు, ధూపపెట్టి అనే పేరుతో  బలవంతంగా శిస్తులు వసూలు చేసేవారు. రజాకార్ల దోపిడీ, దుశ్చర్యలను గోండులు ఖండించినందుకు జంగ్లాతోళ్లు స్థానిక జమీందార్లతో కలిసి జోడేఘాట్ పరిసరాల్లోని ఇండ్లను, పంటలను ధ్వంసం చేశారు. తెల్లదొరలపై ‘మన్యసీమ’లో1922 నుంచి1924 వరకు అల్లూరి సాగించిన మన్యం పోరాటం స్ఫూర్తితో కుమ్రంభీం జోడేఘాట్ గుట్టల నుంచి నిజాం పాలకులపై ‘తుడుం’ మోగించాడు. నిజాం అల్లరి మూకల ఆగ్రహం వల్లే ‘ సిద్ధిఖ్’ ను హతమార్చిన భీం అసోం రాష్ట్రంలో తలదాచుకున్నాడు.  ఇక్కడి ఉద్యమానికి కాస్త విరామం ఏర్పడినా, అసోంలో కార్మిక ఉద్యమాలకు సారథ్యం వహించాడు. తన సహచరుడు కుమ్రం సూరు ద్వారా చదువు నేర్చుకుంటూ రాజకీయం పట్ల అవగాహన పెంచుకున్నాడు. ఇంకా వెడ్మరాము, లచ్చువటేల్ లు భీం ఉద్యమానికి సహకరించిన ప్రధాన అనుచరులు. 

స్వయం పాలన కోసం డిమాండ్

సూరు సాయంతోనే భీం ఆదివాసి హక్కుల పోరాటానికి తగిన ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఆసిఫాబాద్ పరిధిలోని జోడేఘాట్, బాబేజరి, పట్నాపూర్, టోకెన్నావాడు, శివగూడ, చల్బరిడి, బీమన్ గొంది, కల్లేగావ్, అంకుశాపూర్, నర్సాపూర్, కేశగూడ, లైన్ పటల్ అనే12 గ్రామాలకు చెందిన యువకుల సైన్యంతో కుమ్రంభీం వాటిని స్వతంత్ర గోండు రాజ్యం ప్రకటించుకున్నాడు. అందుకు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ అబ్దుల్ సత్తార్ తో జరిపిన చర్చలు సఫలం కాలేదు. కులపెద్దల సలహా మేరకు తమ డిమాండ్లను అర్జీ రాసుకుని నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ కు విన్నవించడానికి హైదరాబాద్ వెళితే అధికారులు భీంకు అనుమతి ఇవ్వకపోవడమేగా అవమానించారు. దీంతో ఉద్యమ కేంద్రంగా ఎంచుకున్న జోడేఘాట్ గుట్టల నుంచి భీం పోరాటానికి సిద్ధపడ్డాడు. రాజీ పడని కుమ్రంభీం పోరాట పటిమకు చలించిన నిజాం సర్కార్ ఓ మెట్టు దిగివచ్చి మన్యం గిరిజనుల ప్రధాన సమస్య అయిన వారి భూములకు పట్టాలిస్తామని వర్తమానం పంపింది. పట్టాలే కాదు అడవిపై సర్వహక్కులు, గూడేలకు స్వయంపాలన కావాలని కొమురం భీం మరోసారి డిమాండ్ చేశాడు.

పోరాట స్ఫూర్తి

కొమురం భీం షరతులను ఒప్పుకోని సర్కార్ పోలీస్, సైనిక బలగాలతో నిఘా పెంచింది. రజాకార్ల అరాచకాలను కళ్లారా చూసిన భీం భార్య సోంబాయి ఓ సందర్భంలో ఎక్కడికైనా పారిపోయి తలదాచుకుందామని ప్రాధేయపడినా కొమురం భీం ఉద్యమ పంథాను వీడలేదు. ‘ఉద్యమంలో గెలిస్తే బతుకుతాం. వచ్చే తరాలు బతుకుతాయి. ఉద్యమం నశిస్తే పోరాట స్ఫూర్తయినా మిగులుతుంది. వెన్ను చూపడం తగదు. వెనుతిరుగేది లేదు’’ అని నినదించిన భీం సందేశం భావితరాలకు స్ఫూర్తిదాయకం. చివరకు కుర్దు పటేల్ రహస్య సమాచారంతో జోడేఘాట్ గుట్టల్లో కుమ్రంభీం1940లో వీరమరణం పొందాడు. భీమ్ దాదా సాహసం, సంకల్ప బలం, త్యాగం, గోండు సమాజం నుంచి ప్రపంచం దాటింది. ఇంగ్లాండు నుంచి హైదరాబాద్ వచ్చిన ఆంత్రోపాలజిస్టు ప్రొఫెసర్ హైమన్​డార్ఫ్ ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న గోండు, కోలాం, కోయ, పరధాన్, నాయకపోడు గిరిజనులతో మమేకమై వారి మీద పరిశోధన చేసిన ఫలితంగానే వారు ఆదిమ గిరిజనులుగా బాహ్య ప్రపంచానికి పరిచయమయ్యారు. ఆనాటి కొమురం భీం పోరాట ఫలితంగానే భారత రాజ్యాంగంలో ఆదివాసులకు అవసరమైన హక్కులను5వ, 6వ షెడ్యూల్లో చేర్చడమే గాక వారికి ప్రత్యేకమైన రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఆదివాసీల ఆశాజ్యోతి కొమురం భీం పోరాట స్ఫూర్తి సాయపడిందని చెప్పవచ్చు.  స్వయంపాలన ఉద్యమానికి పితామహుడిగా నిలిచిన కుమ్రంభీం చరిత్ర భావితరాలకు ఆదర్శనీయం. ఆ ప్రతి ఫలాలు ఆదివాసీలు పొందాలంటే ప్రభుత్వం తగిన కార్యాచరణను రూపొందించి అమలు చేయాలి. – గుమ్మడి లక్ష్మీ నారాయణ, ఆదివాసీ రచయితల వేదిక.