ఫిబ్రవరి 20న బాసర నుంచి కుమ్రం భీం సంకల్ప యాత్ర

  • ప్రారంభించనున్న అస్సాం సీఎం, కిషన్ రెడ్డి

 నిర్మల్, వెలుగు: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం అదిలాబాద్ లోక్ సభ పరిధిలో కుమ్రం భీం సంకల్ప యాత్రను చేపట్టనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్ రెడ్డి, యాత్ర జిల్లా ఇన్​చార్జి రావుల రామనాథ్ తెలిపారు. యాత్ర రూట్ మ్యాప్​కు సంబంధించిన వివరాలను వారు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 20 నుంచి సంకల్ప యాత్ర అదిలాబాద్ లోక్​సభ పరిధిలోని మూడు జిల్లాల్లో కొనసాగుతుందన్నారు. 

బాసర సరస్వతి ఆలయంలో పూజల అనంతరం యాత్ర ప్రారంభమవుతుందని, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు. బాసర నుంచి ప్రారంభమయ్యే యాత్ర భైంసాకు చేరుకొని ఇక్కడ బహిరంగ సభ.. ఆ తర్వాత కల్లూరు, నర్సాపూర్, దిలావర్పూర్ లలో రోడ్ షో లు నిర్వహించనున్నారు. సాయంత్రం నిర్మల్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. 

మరుసటి రోజు నేరేడిగొండ‌‌, ఇచ్చోడ, ఆదిలాబాద్​లో, ఆ తర్వాత ఉట్నూర్, జైనూర్, కెరమెరి, ఆసిఫాబాద్ వరకు  యాత్ర కొనసాగనున్నట్లు చెప్పారు. మొత్తం మూడున్నర రోజులపాటు కొనసాగే ఈ యాత్రలో జాతీయ, రాష్ట్రస్థాయి నాయకులు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంలో మూడోసారి బీజెపీని అధికారంలోకి తేవడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు, బీఆర్ఎస్ అవినీతిని ఎండగడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల లోపాయికారి ఒప్పందంపై ప్రజలకు వివరించనున్నట్లు చెప్పారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ లోక్​సభ ఇన్​చార్జ్ అయ్యన్న గారి భూమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భైంసాలోనూ ఎమ్మెల్యే రామారావు పటేల్​మీడియా సమావేశం ఏర్పాటు చేసి యాత్ర వివరాలు వెల్లడించారు.