79 మంది గిరిజనుల కోసం అడవిలోనూ పోలింగ్ బూత్

కాగజ్​నగర్​, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్​జిల్లా కాగజ్​నగర్ ​మండల కేంద్రానికి 45 కిలో మీటర్ల దూరంలో మాలిని అనే గ్రామం ఉంది. రాష్ట్రంలో తొలి ఓటరు, తొలి పోలింగ్ బూత్ ఉన్న గ్రామం ఇదే. మాలిని పంచాయతీ పరిధిలో పెద్ద మాలిని, చిన్న మాలిని, మానిక్ పటార్ అనే సమీప గ్రామాలు ఉన్నాయి. చిన్నమాలిని, పెద్దమాలని గ్రామాలు మాలినికి కొంత దగ్గరలోనే ఉన్నా.. మానిక్​పటార్​ గ్రామం మాత్రం అడవి లోపల చాలా దూరంలో ఉన్నది. ఎన్నికలు వస్తే మాలిని పోలింగ్​ కేంద్రంలో ఓటు వేసేందుకు మానిక్ పటార్ ఓటర్లు దాదాపు 8 కిలోమీటర్లు దట్టమైన అడవి మార్గం గుండా వాగులు, కాలువలు దాటుతూ ఎడ్ల బండ్లు, కాలినడకన అతికష్టం మీద చేరుకునేవారు.150 మంది జనాభా గల మానిక్​ పటార్​లో 79 మంది ఓటర్లు ఉండగా.. ఆ గిరిజనుల కష్టాలను తీర్చేందుకు ఎన్నికల కమిషన్.. ఈసారి మానిక్​పటార్ ​లోనే ఓ తడకల బడిలో కొత్త పోలింగ్​ కేంద్రం ఏర్పాటు చేసింది. దీనిపై ఆ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -