కునాల్ కమ్రా వివాదం: విమర్శిస్తే ఆఫీస్ కూల్చేస్తారా.. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమే? : కాంగ్రెస్

కునాల్ కమ్రా వివాదం: విమర్శిస్తే ఆఫీస్ కూల్చేస్తారా.. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమే? : కాంగ్రెస్

మహారాష్ట్రలో కమెడియన్ కునాల్ కమ్రా విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీవ్ర వివాదాస్పదం అవుతోంది. స్టాండప్ కామెడీలో భాగంగా డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండేను ‘ద్రోహి’ (గదార్) విమర్శించడంపై మహా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కునాల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే బీజేపీ కార్యకర్తలు.. కామెడీ నిర్వహించిన హోటల్ పై దాడి చేశారు. దీనిపై ఇప్పటికే విమర్శలు వచ్చాయి.

తాజాగా సోమవారం (మార్చి 24) బీఎంసీ (బృహన్ ముంబై కార్పోరేషన్) అధికారులు కునాల్ స్టూడియోను కూల్చేయడం వివాదాస్పదం అవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ స్టూడియోను కూల్చివేశారు అధికారులు. ప్రభుత్వం కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందునే కూల్చి వేస్తున్నట్లు ప్రకటించింది. 

ALSO READ | రాహుల్ గాంధీ పౌరసత్వం కేస్.. కేంద్రానికి అలహాబాద్ హైకోర్టు 4 వారాల డెడ్ లైన్

ప్రభుత్వ నిర్ణయంపై తీవ్రవిమర్శలు వస్తున్నాయి. ‘‘స్టాండప్ కామెడీలో భాగంగా విమర్శలు చేశారని స్టూడియోలు, హోటల్స్ కూల్చేస్తారా..? చట్టాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు దిగితే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడ..?’’ అని కాంగ్రెస్ నేత సుప్రియ శ్రినేత్ అన్నారు.‘‘ విమర్శిస్తే ఆఫీస్ లు కూల్చేస్తారా.. ప్రధాని మోదీనేమో విమర్శ ప్రజాస్వామ్యానికి ఆత్మ అంటారు. మీరేమో విమర్శి్ంచినందుకు కూల్చేస్తారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే’’నని విమర్శించారు.

వాక్ స్వాతంత్ర్యాన్ని అణచేస్తున్నారు: జయా బచ్చన్

స్టాండప్ కమెడియన్ పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణమని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ అన్నారు. ‘‘విమర్శను ఎందుకు తీసుకోలేకపోతున్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరైనా విమర్శిస్తారు. కొందరు కామెడీ రూపంలో చెప్తారు. ఇంకొందరు పాట రూపంలో విమర్శిస్తారు. మరికొందరు సీరియస్ గా విమర్శిస్తారు. కునాల్ పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదు. వాక్ స్వాతంత్ర్యాన్ని అణచేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచి పరిణామం కాదు’’ అని మండిపడ్డారు. 

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే పై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్ర సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం ( మార్చి 23 )రాత్రి ముంబైలోని యూని కాంటినెంటల్ హోటల్ లో నిర్వహించిన స్టాండప్ కామెడీ షోలో ఈమేరకు వ్యాఖ్యలు చేశారు కునాల్ కమ్రా. డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండేను గద్దార్ అంటూ పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా దిల్ తో పాగల్ హై సినిమా పాటను పేరడీ చేస్తూ సెటైర్లు వేశారు కునాల్. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో మహారాష్ట్రలో రాజకీయాలు వేడెక్కాయి.