ముందస్తు బెయిల్ ఇవ్వండి: మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన కమెడియన్ కునాల్ కామ్రా

ముందస్తు బెయిల్ ఇవ్వండి: మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన కమెడియన్ కునాల్ కామ్రా

ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‎ నాథ్ షిండేపై వివాదస్పద కమెడియన్ కునాల్ కామ్రా చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏక్‏నాథ్ షిండేను ‘దేశ ద్రోహి’గా అభివర్ణిస్తూ కామ్రా చేసిన వ్యాఖ్యలపై శివసేన నేతలు ఫిర్యాదు చేయడంతో ముంబై పోలీసులు కునాల్ కామ్రాపై కేసు నమోదు చేశారు. దీంతో కునాల్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ముంబైలో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి అరెస్టు నుండి మధ్యంతర రక్షణ కల్పించాలని కోరుతూ ట్రాన్సిట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 

అయితే.. నిందితుడిపై వేరే రాష్ట్రంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ వారి సొంత రాష్ట్రంలో ముందస్తు బెయిల్ పొందే అవకాశం ఉంటుంది. ఈ నిబంధన ప్రకారమే.. తమిళనాడులోని విల్లుపురం నివాసి అయిన కునాల్.. మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కునాల్ ట్రాన్సిట్ బెయిల్ పిటిషన్‎పై శుక్రవారం (మార్చి 28) మధ్యాహ్నం 2:15 గంటలకు కోర్టు విచారణ చేపట్టనుంది. దీంతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. 

కాగా, 2025, మార్చి 23 రాత్రి ముంబైలోని యూని కాంటినెంటల్ హోటల్‎ లో నిర్వహించిన స్టాండప్ కామెడీ షోలో డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండేపై కమెడియన్ కునాల్ కామ్రా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.  ఏక్ నాథ్ షిండేను గద్దార్ (దేశ ద్రోహి) అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అంతే కాకుండా దిల్ తో పాగల్ హై సినిమా పాటను పేరడీ చేస్తూ షిండేపై సెటైర్లు వేశారు. 

Also Read:-చిన్నప్పుడే.. ఐదారుగురు లైంగికంగా వేధించారు

కునాల్ వ్యాఖ్యలపై శివసేన కార్యకర్తలు భగ్గుమన్నారు. కునాల్ స్టాండప్ కామెడీ నిర్వహించిన హోటల్ ‎ను ధ్వంసం చేయడంతో పాటు వెంటనే కునాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శివసేన ఎమ్మెల్యే మురాజీ పటేల్ కునాల్ కామ్రాపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిప్యూటీ సీఎం షిండేపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని.. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఎమ్మెల్యే మురాజీ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు కునాల్ ‎పై కేసు నమోదు చేశారు.