ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బీఆర్ఎస్ తప్పు చేసింది: కూనంనేని

ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బీఆర్ఎస్ తప్పు చేసింది: కూనంనేని

సభలో అర్థవంతమైన చర్చ జరగాలని... సభ్యులు  వ్యక్తిగత దూషనలు చేయకుండా చర్చ జరగాలని కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు. డిసెంబర్ 16వ తేదీ శనివారం అసెంబ్లీలో ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ..  ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే భావన కలిగేలా మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడారని.. ఇది మంచిది కాదన్నారు.  తెలంగాణ శాసనసభలో మంచి వాతావరణం ఉండాలన్నారు.

అసెంబ్లీలో నిర్మాణాత్మక చర్చలు జరగాలని చెప్పారు. గతంలో బడ్జెట్, చర్చ ఒక్కరోజులోనే పూర్తి చేశారని.. మొక్కుబడిగా సభ జరిగిందని ఆయన విమర్శలు చేశారు.గతంలో వైఎస్ చెప్పిన హమీలన్నీ నెరవేర్చారని.. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందనే నమ్మకం ఉందని అన్నారు.

ఆరు గ్యారంటీలు చట్టబద్దంగా అమలు చేస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. గత ప్రభుత్వం చేయలేని పనులను ఈ ప్రభుత్వం పూర్తి చేయాలని కోరారు. కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బీఆర్ఎస్ మొదటి తప్పు చేసిందన్నారయన. ప్రజల స్వేచ్ఛ, వాక్, భావస్వాతంత్ర్యాలు లేకుండా చేసి రెండో తప్పు చేసిందని అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోవాలని ఆయన కాంగ్రెస్ సర్కార్ కు సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 26 ప్రజా సంఘాలపై నిషేధం విధించిందని కూనంనేని చెప్పారు.