శ్రీ తేజ్‌ను పరామర్శించిన CPI ఎమ్మెల్యే కూనంనేని.. అల్లు అర్జున్‌పై ఫైర్

శ్రీ తేజ్‌ను పరామర్శించిన CPI ఎమ్మెల్యే కూనంనేని.. అల్లు అర్జున్‌పై ఫైర్

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్‌ను సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్రమక్రమంగా బాలుడు కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారని ఆయన మీడియాకు వెల్లడించారు. 

అనంతరం మీడియాతో మాట్లాడిన కూనంనేని.. అల్లు అర్జున్‌పై ఫైర్ అయ్యారు. రేవంత్ అసెంబ్లీలో మాట్లాడిన అనంతరం నిజానిజాలేంటనేది ప్రజలకు తెలిశాయని అన్నారు. పోలీసులు సైతం అన్ని అంశాలు క్లియర్‌గా చెప్పడం.. వీడియో రిలీజ్ చేయడంతో వాస్తవాలు బయటకొచ్చాయని అన్నారు. ప్రభుత్వం, పోలీసులు చెప్పిన మాటలు వింటే.. అల్లు అర్జున్ చెప్పిన వివరాలు నమ్మశక్యంగా లేవని తెలిపారు.  ఈ అంశంపై రాజకీయం చేయడం మానుకోవాలని కూనంనేని.. ప్రతిపక్షాలకు సూచించారు. 

అప్పటి సినిమాలు వేరు.. 

పూర్వపు సినిమాలు సమాజాన్ని మార్చడానికి ఉపయోగపడితే.. ఇప్పుడొస్తున్న సినిమాలు సమాజాన్ని ఎటు వైపు తీసుకెళ్తున్నాయో అర్థం కావడం లేదని కూనంనేని సాంబశివరావు అన్నారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, పేదవారిని హీరోగా చూపించేలా గతంలో సినిమాలు ఉంటే.. ఇప్పటి చిత్రాల్లో విలన్‌ను హీరోలా చూపిస్తున్న తీరును ఆయన ప్రశ్నించారు. ఈ పద్ధతిలో మార్పు రావాలని సూచించారు. సామాజిక, సందేశాత్మక చిత్రాలకు సెన్సార్ బోర్డు అనుమతులు ఇవ్వకుండా.. పోలీసు వ్యవస్థను అణచివేసే విధంగా రౌడీయిజాన్ని ప్రోత్సహించే సినిమాలకు అనుమతులు ఇవ్వడం శోచనీయమని సెన్సార్ బోర్డు తీరును ఆయన దుయ్యబట్టారు. రౌడీయిజాన్ని ప్రోత్సహించే సినిమాలకు అనుమతులు ఇవ్వొద్దని కూనంనేని.. సెన్సార్ బోర్డుకు సూచించారు.