బూడిద ​ఊరిని కప్పేస్తోంది .. యాష్​ పాండ్‌ దుమ్ముతో కాలుష్యం బారిన కుందనపల్లి 

పెద్దపల్లి, వెలుగు :  యాష్​పాండ్​ దుమ్ముతో పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కుందనపల్లి గ్రామం కాలుష్యం బారినపడుతోంది. దీంతో గ్రామస్తులు రోగాలపాలవుతున్నారు. 30 ఏండ్ల కింద ఎన్టీపీసీ ఏర్పాటు టైంలో పరిసర గ్రామాల ప్రజలకు సుమారు 28 వేల ఎకరాలు సేకరించి పునరావాసం కల్పించారు. అయితే పక్కనే ఉన్న కుందనపల్లికి ఎన్టీపీసీ నుంచి వెలువడే యాష్‌తో ఎఫెక్ట్​ ఉండదని భావించి ఈ గ్రామాన్ని వదిలేశారు. ఎన్టీపీసీ నిర్మాణం అనంతరం గ్రామానికి కేవలం 100 మీటర్ల దూరంలో యాష్​ పాండ్​ నిర్మించారు. దీంతో కంపెనీ నుంచి వచ్చే యాష్​తో కూడిన బురద చెరువులోకి చేరుతోంది. వానాకాలంలో అయితే వరద నీటితో కలిసి యాష్ ఇండ్లల్లోకి చేరుతోంది. ఎండాకాలంలో గాల్లో కలిసి ఊరును కప్పేస్తోంది. దీంతో ప్రజలు ఊపిరితిత్తులు, కండ్లకు సంబంధించిన రోగాల బారినపడుతున్నారు.  యాష్‌, దుమ్ము వల్ల పంటలు పండడంలేదని, తాగేనీరు కూడా రంగు మారుతోందని , భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.

యాష్​ పాండ్​ మూసేయాలని ఫిర్యాదులు.. 

యాష్​ పాండ్​ వల్ల ఎదురయ్యే సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకుంటలేరని గ్రామస్తులు చెబుతున్నారు. యాష్​ పాండ్​ను దాదాపు 3 వేల ఎకరాల పరిధిలో ఏర్పాటు చేశారు. 2004, 2012లలో యాష్​ పాండ్‌ను మూసేయాలని కలెక్టర్​కు  గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. పొల్యూషన్​ బోర్డు నిర్ణయం వెలువడే వరకు యాష్​ పాండ్​ మూసేయాలని అప్పటి కలెక్టర్​ఆదేశాలివ్వడంతో కొంతకాలం యాష్​పాండ్‌లో డంపింగ్​ ఆపేశారు. అనంతరం మళ్లీ స్టార్ట్​ చేశారు. నానాటికీ యాష్ ఎఫెక్ట్​ పెరుగుతుండడంతో తమకు పునరావాసం కల్పించాలని గ్రామస్తులు కలెక్టర్‌‌ను కోరారు. పెద్దపల్లి జిల్లాగా  ఏర్పాటైన నాటి నుంచి  వచ్చిన కలెక్టర్లకు కుందనపల్లి పరిస్థితి చెప్పామని, అయినా ఎలాంటి స్పందన లేదని గ్రామస్తులు వాపోతున్నారు. సమస్య ఢిల్లీ స్థాయిలో పరిష్కారం కావాల్సి ఉందని ఆఫీసర్లు చెబుతున్నారని గ్రామస్తులు 
పేర్కొంటున్నారు. 

సమస్యలు చెప్పుకునేందుకు పాలకవర్గం లేదు

రామగుండం మండలంలో ఉన్న కుందనపల్లిని కొత్తగా ఏర్పడ్డ అంతర్గాం మండలంలో కలిపారు. అనంతరం రామగుండం కార్పొరేషన్​లో విలీనం చేశారు.  తర్వాత డీలిమిటేషన్​లో రామగుండం కార్పొరేషన్​ నుంచి తొలగించారు. ఆ తర్వాత గ్రామంలో ఎన్నికలు నిర్వహించకుండా స్పెషల్​ ఆఫీసర్​ను నియమించి పాలన సాగిస్తున్నారు. అప్పటి నుంచి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. గతంలో జీపీగా ఉన్నప్పుడు పంచాయతీలో చర్చించి ప్రభుత్వానికి తెలియజేసే అవకాశం ఉండేది.  ప్రస్తుతం పాలకవర్గం లేకపోవడంతో ఫండ్స్​వచ్చే పరిస్థితి లేదని, సమస్యలు వినేవారు లేరని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  సమస్యలను స్పెషల్​ ఆఫీసర్​ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదని గ్రామస్తులు 
చెబుతున్నారు. 

గ్రామాన్ని ఎన్టీపీసీ తీసుకోవాలే

యాష్​పాండ్​తో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రజలు రోగాల బారినపడుతున్నారు. తాగడానికి నీరు కరువైంది. బావుల్లోని నీరు రంగు మారింది. యాష్​పాండ్​ దుమ్ముతో కండ్లు, ఊపిరితిత్తుల రోగాలు వస్తున్నాయి. దుమ్ము, యాష్​ బురద వల్ల పంటలు పండుత లేవు. గ్రామాన్ని కంపెనీ తీసుకొని మాకు ఎక్కడైనా పునరావాసం కల్పించాలి.

– చొప్పరి శ్రీనివాస్​​, కుందనపల్లి గ్రామస్తుడు

ఇక్కడ బతికేటట్టు లేదు...

యాష్​ పాండ్​ వల్ల గ్రామంలో బతికే పరిస్థితి లేదు.  వ్యవసాయం చేయలేకపోతున్నాం, దుమ్ము వల్ల పంటలు నష్టపోతున్నాం, యాష్ ​బురద మూలంగా భూగర్భ జలాలు పాడైపోతున్నయి.  ఇక్కడ నీళ్లు తాగితే రోగాలొస్తున్నయి, దుమ్ముతో శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నం. అధికారులు మా బాధను గుర్తించి తమకు పునరావాసం కల్పించాలే.
– మేకల శ్రీనివాస్​, గ్రామస్తుడు, కుందనపల్లి