కాంగ్రెస్​హాయాంలోనే తండాల అభివృద్ధి: జానారెడ్డి

హాలియా, వెలుగు:  కాంగ్రెస్​ హయాంలోనే గిరిజన తండాలు అభివృద్ధి చెందాయని మాజీ సీఎల్పీ లీడర్ కుందూరు జానారెడ్డి చెప్పారు. శుక్రవారం నల్గొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండల కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో సాగర్​ అభ్యర్థి కుందూరు జయవీర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ..  గత 30 ఏండ్లుగా ​నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశానన్నారు.

 సీఎం కేసీఆర్‌‌ గత​ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. తండాల్లో ఇందిరమ్మ ఇండ్లు తప్ప కేసీఆర్‌‌ చెప్పిన డబుల్ ​బెడ్‌ రూం ఇండ్లు లేవన్నారు. ఉచిత కరెంట్‌ మొదలు పెట్టిందే కాంగ్రెస్‌ అని అధికారంలోకి రాగానే 24 గంటలు ఇస్తామని చెప్పారు.  రైతులకు ఎకరానికి రూ. 15 వేలు, రైతు కూలీలకు రూ. 12 వేలు, రూ. 500 లకే గ్యాస్​ సిలిండర్, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం హామీలు అమలు చేస్తామన్నారు.

అనంతరం జానారెడ్డి సమక్షంలో ఆర్ఎస్ఎస్ మండల అధ్యక్షుడు శాగం రాఘవరెడ్డి, కోఆప్షన్​ మెంబర్ ఎం.డీ రహీం తో పాటు 2 వేల మంది బీఆర్‌‌ఎస్‌ కార్యకర్తలు  కాంగ్రెస్‌లో చేరారు.  డీసీసీ అధ్యక్షుడు కేతావత్​ శంకర్​ నాయక్​, పీసీసీ ప్రధాన కార్యదర్శి కుందూరు రఘు వీర్​రెడ్డి, డెలిగేట్ సభ్యుడు కర్నాటి లింగారెడ్డి, నాయకులు లింగారెడ్డి,  నారాయణ గౌడ్, చంద్రశేఖర్ రెడ్డి, రావుల చిన్న భిక్షం యాదవ్, కృష్ణా నాయక్​, శాగం పెద్దిరెడ్డి, శాగం రాఘవ రెడ్డి, శేఖర్​ పాల్గొన్నారు.