- సింగిల్ నామినేషన్‌తో ఎన్నిక ఏకగ్రీవం
- కాంగ్రెస్ ఖాతాలోకి జిల్లా కీలక పదవి
- ఖాళీగా వైస్ చైర్మన్ పోస్టు
నిజామాబాద్, వెలుగు : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) ఛైర్మన్‌గా కుంట రమేశ్ రెడ్ది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఆయన ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ నెల 21న మెజారిటీ డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానంతో పోచారం భాస్కర్‌రెడ్డిని ఛైర్మన్ పదవి నుంచి దింపేయడంతో ఖాళీ అయిన పోస్టు భర్తీ చేయడానికి మంగళవారం ఎన్నిక నిర్వహించారు. ఓటు హక్కు ఉన్న మొత్తం 20 మంది డైరెక్టర్లలో 17 మంది హాజరై కుంట రమేశ్‌రెడ్డితో నామినేషన్ వేయించారు.
ఆయనకు పోటీగా ఎవరూ నామినేషన్ వేయనందున ఎన్నిక యునానిమస్ అయినట్లు డీసీవో శ్రీనివాస్‌రావు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన సర్టిఫికేట్‌ను చైర్మన్‌గా ఎన్నికైన రమేశ్‌రెడ్డికి ఆయన అందించారు. సభ్యుల ఆవిశ్వాసంతో పదవి కోల్పోయిన పోచారం భాస్కర్‌రెడ్డి ఈ ఎన్నికలో పాల్గొనలేదు. కీలకమైన చైర్మన్ పదవి కాంగ్రెస్ లిస్టులో చేరడంతో పార్టీ లీడర్లు సంతోషంగా ఉన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, అంతిరెడ్డి రాజిరెడ్డి తదితర కాంగ్రెస్ నేతలు చైర్మన్ రమేశ్ రెడ్డిని పూలమాలలతో అభినందించారు.
వైస్ చైర్మన్ పోస్టు ఖాళీ
ఈనెల 21న నిర్వహించిన బలపరీక్షలో ఓడిపోయి పోచారం భాస్కర్‌రెడ్డి పదవి కోల్పోయాక వైస్ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డికి ఇన్చార్జ్ చైర్మన్ బాధ్యతలు అదే రోజు అప్పగించారు. ఇప్పుడు బ్యాంకు పూర్తి స్థాయి చైర్మన్‌గా ఆయనే ఎన్నికవడంతో వైస్ చైర్మన్ కుర్చీ వెకెంట్ అయింది. ఖాళీ అయిన వైస్ చైర్మన్ పోస్టు ఎన్నికను డైరెక్టర్లు తీర్మానం ద్వారా కోరితే గవర్నమెంట్ తేది ప్రకటించి నిర్వహిస్తుంది. ఈ పదవిని ముగ్గురు డైరెక్టర్లు ఆశిస్తుండగా ఏకాభిప్రాయ సాధనకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు.
రైతులకు అండగా ఉంటా
జిల్లా రైతాంగానికి సేవ చేసే పదవి లభించినందుకు సంతోషంగా ఉందని చైర్మన్‌గా ఎన్నికైన రమేశ్‌రెడ్డి మీడియాతో అన్నారు. పాలకవర్గంలోని డైరెక్టర్లందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానన్నారు. సింగిల్ విండో పాలకవర్గానికి అందుబాటులో ఉంటానన్నారు. తనకు పదవి లభించేలా కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన
కృతజ్ఞతలు తెలిపారు.