భూదురాక్రమణకు లైసెన్స్.. ‘ధరణి’

రాజన్న సిరిసిల్ల,వెలుగు :  రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి దురాక్రమణకు లైసెన్స్ వంటిదని, దీంతో  పేదలకు  ఎలాంటి మేలు లేదని జనశక్తి నేత కూర రాజన్న విమర్శించారు.    శుక్రవారం ఆయన సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతూ..   తెలంగాణ  గ్రామాల్లో  భూతగాదాలు పెరిగిపోయాయని, వాటి పరిష్కారం కోసం  ప్రజల భాగస్వామ్యంతో గ్రామస్థాయిలో కమిటీలు  ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.  భూ తగాదాల పరిష్కరించాల్సిన రెవెన్యూ, పోలీసు , రాజకీయ నాయకులు కూడా రియల్టర్లు గా మారిపోయారన్నారు.  

గ్రామాల్లో  భూములు వాస్తవ హక్కుదారుల  చేజారిపోయాయన్నారు.  నక్సలైట్లతో  ప్రభుత్వం  చర్చలు జరుపుతున్న సమయానికి  తెలంగాణలో కోటి 20 లక్షల ఎకరాలకు పైగా మిగులు భూములు ఉండేవని,  అవేవీ  ధరణి రికార్డుల్లోకి ఎక్కలేదని అన్నారు.  పేదలకు చెందాల్సిన అసైన్ ల్యాండ్, చెరువు శిఖం,  గ్రామ కంఠం,  ఇతర ప్రభుత్వ భూములు ఏమయ్యాయని  ప్రశ్నించారు.  పాత రికార్డులతో  ధరణి రికార్డులను వెరిఫై చేస్తే ధరణిలో ఎక్కని భూముల వివరాలు  దొరుకుతాయన్నారు. సమస్యల పరిష్కారం కోసం గ్రామ వేదికలే శరణ్యమన్నారు.