అలంపూర్, వెలుగు: అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదో శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి అమ్మవార్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టు వస్త్రాలను సమర్పించింది. ఆదివారం కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా కుటుంబ సమేతంగా తీసుకొచ్చిన పట్టువస్త్రాలను జోగుళాంబ ఆలయంలో అందజేశారు. రెండు రాష్ట్రాల ప్రజలకు సకల శుభాలు కలగాలని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా కలెక్టర్ కు ఆలయ ఈవో పురేందర్ కుమార్, పాలక మండలి చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, అర్చకులు సాదర స్వాగతం పలికారు.
అనంతరం కర్నూలు కలెక్టర్ కు తీర్థ ప్రసాదాలను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ తమ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జోగుళాంబ అమ్మవారికి పట్టు వస్త్ర సమర్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలంపూర్ తో తనకు సంబంధాలు ఉన్నాయని, తన తల్లిది ఇక్కడే అని గుర్తు చేసుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు రెండు తెలుగు రాష్ట్రాలపై ఉండాలని ఆయన కోరారు. ఆలయ అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు.