
అసభ్యకర వ్యాఖ్యల కేసులో అరెస్టైన నటుడు పోసానికి బిగ్ రిలీఫ్ లభించింది. ఆదోని, విజయవాడ కోర్టుల్లో పోసానికి బెయిల్ మంజూరు అయ్యింది. ఇప్పటికే రాజంపేట, నరసరావుపేట కోర్టుల్లో బెయిల్ మంజూరైన పోసానికి ఇది బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. ప్రస్తుతం కర్నూలు జైలులో ఉన్న పోసాని బుధవారం ( మార్చి 12 ) జైలు నుంచి రిలీజయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే.. పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో14 కేసులు నమోదైన క్రమంలో ఆయనను రిలీజ్ చేస్తారా లేక మళ్ళీ పీటీ వారెంట్ పై మరో జైలుకు తరలిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన క్రమంలో పోసానిపై
రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫిబ్రవరి 26న అన్నమయ్య జిల్లా పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. కడప కోర్టు పోసానికి రిమాండ్ విధించటంతో రాజంపేట జైలుకు తరలించారు పోలీసులు. ఆ తర్వాత పీటీ వారెంట్ పై నరసరావుపేట, గుంటూరు, కర్నూలు.. ఇలా పలు జైళ్లకు తరలించారు పోలీసులు.
ALSO READ | మూడేళ్లలో రాజధాని అమరావతిని పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ
మార్చి 5వ తేదీ నుంచి కర్నూలు జైలులో ఉన్న పోసానికి ఎట్టకేలకు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది కోర్టు. పోసానికి బెయిల్ పిటిషన్‌ను ప్రభుత్వ న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. పోసానిని మరింత విచారించాలని... అసభ్యకర వ్యాఖ్యల వెనుక ఎవరున్నారన్నది తెలియాలని.. కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు ప్రభుత్వం తరపు న్యాయవాదులు. సుదీర్ఘ విచారణ తర్వాత సోమవారం ( మార్చి 10 ) కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేసిన కోర్టు.. ఇవాళ ( మార్చి 11 ) బెయిల్ మంజూరు చేసింది.. ఇకనైనా పోసాని జైలు నుంచి రిలీజ్ అవుతారా లేక ఈ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంటుందా వేచి చూడాలి.