కర్నూలు జిల్లాలోని దేవరగట్టు కర్రల సమరానికి అంతా రెడీ అయ్యింది. దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి బన్ని జైత్రయాత్ర ఇవాళ అర్ధరాత్రి జరగనుంది. దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఉత్సవాల సందర్భంగా ఉత్సవ మూర్తులను దక్కించుకోవడానికి నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఓ వైపు, అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్ , విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడతారు.
దేవరగట్టులో బన్ని ఉత్సవం ప్రశాంతంగా జరిగేలా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో ఏడుగురు డీఎస్పీలు, 23మంది సీఐలు, 60 మంది ఎస్సైలు, 164 మంది ఏఎస్సైలు, 322 మంది కానిస్టేబుళ్లు, 50 మంది ప్రత్యేక పోలీసులు, మూడు ప్లాటూన్ల ఆర్మ్‌డ్ రిజర్వ్ సిబ్బంది కేటాయించారు. మద్యం నియంత్రించేందుకు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో బృందాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు చేపట్టారు.
దేవరగట్టుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు చేపట్టారు. పలు మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా సీసీ కెమెరాలతో పాటు డ్రోన్లతో నిఘా పెట్టారు. కొండపై వాహనాల రాకపోకలు నిషేధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. బన్ని ఉత్సవం సందర్భంగా గాయాలైన వారికి చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా 20 పడకలతో హాస్పిటల్ ఏర్పాటు చేశారు.