కర్నూలు జిల్లా టీడీపీ నేత ఎదురూరు విష్ణువర్దన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదేళ్ల క్రితం రేపల్లె సామేల్ అనే వ్యక్తి కుటుంబాన్ని గ్రామ బహిష్కారం చేశాడనే ఆరోపణలపై అతన్నిఅరెస్ట్ చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు సమాచారం.
తనను గ్రామంలోకి రానీయకపోవడం వల్ల ఐదేళ్లు బయటే ఉంటూ చాలా కష్టపడ్డానని, గ్రామ బహిష్కారం వల్ల చాలా నష్టపోయానంటూ సామేల్ రెండు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకే పోలీసులు విష్ణు వర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసి కర్నూలు తాలుకా స్టేషన్ కు తీసుకొచ్చారు.
మరోవైపు విష్ణు అనుచరులు తమ నాయకుడిని అక్రమంగా అరెస్టు చేశారని పోలీసు స్టేషన్ ను ముట్టడించారు. వారి ఆందోళనతో పోలీసు స్టేషన్ దిగ్బంధనం చేశారు. దీంతో కర్నూలు తాలుకా పోలీసు స్టేషన్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. కర్నూలు-నంద్యాల రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.