కేసీఆర్ కురుమలను మోసం చేసిండు

మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తామని తెలంగాణ కురుమ సంఘం ప్రకటించింది. రాజగోపాల్ రెడ్డి విజయం కోసం తామంతా శ్రమిస్తామని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ సామాజిక వర్గానికి అన్యాయం చేశారని కురుమ సంఘం సభ్యులు మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం స్వార్థపూరితంగా వ్యవహరిస్తూ తమ సామాజికవర్గాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. 

రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయకుండా కేవలం మునుగోడు వారికే జీవాలను కేటాయించడం దారుణమని కురుమ సంఘం సభ్యులు వాపోయారు. మునుగోడు ఉప ఎన్నిక దృష్ట్యా స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ను ఓడిస్తామని చెప్పారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలుపునకు కురుమ సంఘం ఆధ్వర్యంలో శక్తివంచన లేకుండా పనిచేస్తామని హామీ ఇచ్చారు.