మహబూబ్‌నగర్/చిన్నచింతకుంట, వెలుగు : కురుమూర్తి గుట్టలను అక్రమార్కులు కరిగించేస్తున్నారు. వెయ్యేండ్ల చరిత్ర ఉన్న గుట్టలను రోడ్డు నిర్మాణంలో మొరం మట్టి అవసరాల కోసం తవ్వేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కురుమూర్తి ఆలయం పక్కన నెల రోజుల నుంచి జోరుగా మట్టి తవ్వకాలు సాగుతున్నా మైనింగ్, రెవెన్యూ ఆఫీసర్లు చర్యలు తీసుకోవడం లేదు. మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ లోని కురుమూర్తి ఆలయం, చిన్నచింతకుంట మధ్య ఉన్న ఊకచెట్టువాగుపై బ్రిడ్జి కం చెక్‌డ్యామ్, రోడ్లు నిర్మిస్తున్నారు. 460 మీటర్ల బ్రిడ్జ్ కం చెక్ డ్యామ్‌తో పాటు బ్రిడ్జి నుంచి కురుమూర్తి ఆలయం వరకు 1.8 కిలోమీటర్ల బీటీ రోడ్డు, అక్కడి నుంచి గుట్టపైకి కిలోమీటర్ ఘాట్ రోడ్డు నిర్మిస్తారు. రూ. 40 కోట్లతో చేపడుతున్న ఈ పనులను 2022 జనవరి 19న ఎక్సై జ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం బ్రిడ్జి, చెక్‌డ్యామ్ పనులు జరుగుతున్నాయి. 1.8 కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులకు సంబంధించి ముందుగా ఫార్మేషన్ రోడ్డు వేయాలి. టెంపుల్ నుంచి బ్రిడ్జి వరకు వేస్తున్న రోడ్డు ఎత్తును పెంచుతున్నారు. టెంపుల్ దగ్గర ఒక మీటర్‌తో ప్రారంభించి క్రమంగా ఎత్తు పెంచుతూపోతారు. బ్రిడ్జ్ అప్రోచ్ వద్దకు వచ్చే సరికి 3.6 మీటర్ల ఎత్తు పెరుగుతోందని ఆర్అండ్బీ ఆఫీసర్లు చెప్తున్నారు. ఇందుకు మట్టి అవసరం ఎక్కువగా ఉంటుంది.
హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్ట్ కంపెనీ వీఎస్ఈ ఇన్ ఫ్రా మట్టి కోసం కురుమూర్తి గుట్టలను టార్గెట్ చేసింది. ఆలయానికి సంబంధించిన ఏడు గుట్టల్లో పెద్దగుట్ట ఘనాద్రి మీద కన్నేశారు. గూడూరు గ్రామ పంచాయతీలోని సర్వేనంబర్ 99లో 216.33 ఎకరాల్లో ఈ గుట్ట ఉంది. గుట్టచుట్టూ ఉన్న అసైన్డ్ భూముల్లో ఎస్సీలు పంటలు సాగు చేసుకుంటున్నారు. మొదట నెల కింద ఓ రైతు పొలం నుంచి మట్టి తరలించిన కాంట్రాక్టర్ ఆ తర్వాత ఎలాంటి పర్మిషన్లు లేకుండా పెద్దగుట్ట వద్ద జేసీబీలతో తవ్వకాలు ప్రారంభించారు. 21 మీటర్ల ఎత్తు వరకు.. గుట్ట చుట్టూ వంద మీటర్ల వరకు తవ్వేశారు.
బడా లీడర్ అండతోనే..
పెద్దగుట్ట వద్ద మట్టి తవ్వకాల గురించి ఎండోమెంట్, రెవెన్యూ, మైనింగ్ ఆఫీసర్లకు తెలిసినా పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. కురుమూర్తి పాలక వర్గంలోని కొందరు ఇక్కడ మట్టి తవ్వుకోమని నోటిమాటగా కాంట్రాక్టర్‌కు అనుమతి ఇచ్చినట్టు ఎండోమెంట్ డిపార్ట్మెంట్సిబ్బంది చెప్తున్నారు. నియోజకవర్గానికి చెందిన బడా లీడర్‌కు కాంట్రాక్టర్ సన్నిహితుడు కావడంతో ఎవరూ ఈ అక్రమ తవ్వకాల గురించి మాట్లాడడంలేదు. పెద్దగుట్ట వద్ద మట్టి తవ్వకాలు చేయడం వల్ల ప్రమాదం పొంచి ఉందని, 21 మీటర్ల ఎత్తు వరకు తవ్వడంతో భారీ వర్షాలు పడ్డప్పుడు గుట్ట కోతకు గురయ్యే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గుట్ట నుంచి పారే జాలు కింది పొలాల్లోకి చేరుతుందని, మట్టి కోసం తీసిన గుంతల్లో నీరు నిల్వ చేరితే పక్కనున్న పొలాల్లోకి వెళ్లేందుకు కూడా ఇబ్బంది పడాల్సివస్తుందని వాపోతున్నారు.
అనుమతి తప్పనిసరి
కురుమూర్తి బ్యాక్ సైడ్ మట్టి పనులు చేస్తుంటే కొందరు యువకులు అడ్డుకున్నారని మా ఏఈ ఫోన్ చేసి చెప్పిండు. కాంట్రాక్టర్‌కు మట్టి ఎక్కడ తీసుకోవాలో చెప్పాం. పనులు జరిగే చోటు నుంచి ఐదారు కిలోమీటర్ల పరిధిలో తీసుకోవాలనిమాత్రమే చెప్తాం. అయితే ప్రైవేట్ ల్యాండ్అయితే ఓనర్నుంచి, గవర్నమెంట్ ల్యాండయితే తహసీల్దార్నుంచి అనుమతులు కచ్చితంగా తీసుకోవాలి.
- నరేందర్, ఆర్అండ్బీ డీఈ, మహబూబ్‌నగర్
ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు
కురుమూర్తి గుట్టలు ప్రాచీనమైనవి. ఇక్కడి గుట్టల్లో మట్టి తవ్వకాలకు నేను ఎవరికీ పర్మిషన్ ఇవ్వలేదు. అనుమతులు తీసుకోకుండానే వారు మట్టిని తరలించారు. ఈ విషయాన్ని మైనింగ్ ఆఫీసర్లకు చెప్పాం. గురువారం వారు పెద్దగుట్టకు వచ్చి పరిశీలించారు. వారిచ్చే రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటాం.
- సువర్ణ రాజు, తహసీల్దార్, చిన్నచింతకుంట