నీళ్లున్నా ఎత్తిపోయని కురుమూర్తి.. ఏడాదిన్నరగా పని చేయని స్కీం

నీళ్లున్నా ఎత్తిపోయని కురుమూర్తి.. ఏడాదిన్నరగా పని చేయని స్కీం

మహబూబ్​నగర్/చిన్నచింతకుంట, వెలుగు : కురుమూర్తి రాయ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ఉన్నా రైతులకు ఉపయోగపడడం లేదు. రామన్​పాడ్​ బ్యాక్​ వాటర్  ఫుల్​గా ఉన్నా, స్కీం ద్వారా చుక్క నీటిని కూడా పంటలకు ఎత్తిపోసుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో స్కీం కింద ఉన్న ఆరుతడి పంటలకు ఏడాదిన్నరగా సాగునీరు అందక పడావుగా మారాయి.

ఒక్క ఎకరానికి నీరందట్లే..

కురుమూర్తి రాయ స్కీం కింద కొత్తపల్లి, దుప్పల్లి, అమ్మాపూర్​, కురుమూర్తి గ్రామాల పరిధిలోని 4,650 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉండడంతో వానాకాలం సీజన్​ మొదట్లో స్కీం ద్వారా ఆరుతడి పంటలకు సాగునీరు అందిస్తామని చాటింపు వేయించారు. దీంతో వరి సాగు చేయాల్సిన రైతులు పత్తి వేశారు. కానీ, ఆగస్టు నెల చివరి వరకు స్కీం ద్వారా నీటిని విడుదల చేసే విషయంపై క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో పత్తి వేసుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. 

ఈ పంటకు పదిహేను రోజులకోసారి కూడా నీరు వదలకపోవడంతో ప్రస్తుతం పంటలన్నీ ఎదగడం లేదు. పైగా స్కీంను రన్​ చేయాలంటే కాలువలు, రివిట్​మెంట్​పనులు, మెయిన్​ కెనాల్స్​ నుంచి పిల్ల కాలువలు, తూములకు రిపేర్లు చేయాల్సి ఉంది. ఇందు కోసం కోట్లల్లో ఖర్చు కానుంది. అయితే, వీటి రిపేర్ల కోసం నిధులు విడుదల చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి సీఎంను కలిశారు. స్కీంను రన్​ చేయడానికి, రిపేర్లు చేయడానికి రూ.2 కోట్ల ఫండ్స్​ మంజూరు చేయాలని కోరారు. కానీ, ఇప్పటి వరకు మంజూరు కాలేదు.

నీటి తీరువా కమిటీలో రాజకీయం..

2002 వరకు స్కీంను ఏపీఎస్ఐడీసీ ఆధ్వర్యంలో నడిపించగా, ఆ తర్వాత నీటి తీరువా కమిటీ ఏర్పాటు చేసి స్కీం బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి ప్రతి రెండున్నరేండ్లకోసారి రాజకీయాలకు అతీతంగా రైతులే కొత్త కమిటీలు వేస్తున్నారు. ఇప్పటి వరకు 8 సార్లు కమిటీలు వేయగా, చివరి సారిగా 2018లో కమిటీ వేశారు. ఈ కమిటీ కాలపరిమితి 2020లో ముగియగా, ఇప్పటి వరకు కొత్త కమిటీ వేయడం లేదు. ఇందులో రాజకీయ జోక్యం పెరగడంతో రైతులు కమిటీ గురించి మాట్లాడటం లేదు. ప్రస్తుతం పూర్తి స్థాయి కమిటీ లేదు. ఈ కమిటీ చైర్మన్​ తాను పని చేయనని తెగేసి చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. 

మోటార్లపై ప్రెషర్..​

స్కీంలో మూడు మోటార్లు ఉండగా, మరొకటి స్టాండ్​బైగా ఉంది. ఇటీవల రెండు మోటార్లు చెడిపోగా రూ.10 లక్షలతో రిపేర్లు చేయించారు. అయితే, మోటార్లకు నాన్​ రిటర్న్​ వాల్వ్​లను ఏర్పాటు చేయలేదు. దీంతో నీరు రివర్స్  రాకపోవడంతో మోటార్లపై ప్రెషర్​ పడి కాలిపోతున్నాయి. సెకండ్​ స్టేజీలో రెండు మోటార్ల కనెక్షన్​ పైపులు సరిగా లేవు. అలాగే కాలువలకు రివిట్​మెంట్​ పూర్తి చేయలేదు. పిల్ల కాలువలు సక్రమంగా లేకపోవడంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. దీనికితోడు ఐదేండ్లుగా పూర్తి ఆయకట్టుకు నీరందకపోవడంతో కొన్ని గ్రామాల రైతులు పిల్ల కాల్వలను ధ్వంసం చేశారు.

నీళ్లు ఎప్పుడస్తయో..

కురుమూర్తి రాయ స్కీం కింద మా కుటుంబాలకు 20 ఎకరాల భూమి ఉంది. స్కీం కింద నీళ్లు వస్తలేవు. వర్షాలు కూడా పడ్తలేవు. దీంతో మా పొలాలు పడావు పెట్టినం. జీవాలకు గడ్డి కూడా దొరుకుతలేదు. ఎమ్మెల్యే పనులు చేయిస్తడని అంటున్నారు. కానీ, ఆ పనులు ఎప్పుడైతయో? నీళ్లు ఎప్పుడు పారుతయో తెలుస్తలేదు.

గొల్ల ఎర్ర మాసన్న, రైతు, దుప్పల్లి, మదనాపురం మండలం