- పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం
- నెల రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాలు
- వివిధ రాష్ట్రాల నుంచి భారీగా తరలిరానున్న భక్తులు
చిన్నచింతకుంట, వెలుగు : రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన క్షేత్రమైన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు మహబూబ్నగర్జిల్లాలో ఈనెల 31 నుంచి వైభవంగా షురూ కానున్నాయి. అనంతరం నెల రోజుల పాటు జాతర కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో జాతరలు మొదలై వచ్చే ఏడాది ఉగాది వరకు కొనసాగుతాయి. కురుమూర్తి, కురుమతి, కురుమన్న.. ఇలా వివిధ పేర్లతో పిలుచుకునే కురుమూర్తి స్వామి సాక్షాత్తూ తిరుపతి వేంకటేశ్వరస్వామి అవతారంగా భక్తులు విశ్వసిస్తారు.
ఈ బ్రహ్మోత్సవాల్లో ఉద్దాల ఊరేగింపు ప్రధాన ఘట్టం. ఇందులో పూనకాలు, నృత్యాలు, పరవశిస్తూ భక్తులు తన్మయత్వంతో పెట్టే కేకలు పెడుతుంటారు. వీపుపై పాదుకలతో కొట్టించుకుంటే పాపాలు పోతాయని కూడా భక్తుల నమ్మకం. కార్తీకమాసంలో జాతర సందర్భంగా ఇక్కడ గట్టు కొనభాగాన వెలిగించే దీపం అత్యంత మహిమాన్వితం అయినది.
కురుమూర్తి విశేషాలు..
మహబూబ్‌నగర్‌జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ కు 5 కిలోమీటర్ల దూరంలో కురుమూర్తి క్షేత్రం ఉంది. ఏపీలోని తిరుపతిలో ఉన్నట్టుగానే ఇక్కడ శేషాద్రి, ఏకాద్రి, కోటగట్టు, ఘనాద్రి, భల్లూకాద్రి, పతకాద్రి, దేవతాద్రి అనే ఏడు కొండలు ఉంటాయి. ఇందులో దేవతాద్రి గుట్టపై వేంకటేశ్వ రుడు స్వయంభూగా వెలిశాడు. ఆ గుట్టను కాంచన గుహ అని కూడా అంటారు. ఇక్కడి మూల విరాట్‌కు మీసాలు ఉండడంతో మీసాల వేంకటేశ్వరు డిగానూ పిలుస్తారు.
బ్రహ్మోత్సవాలకు తెలంగాణ, ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు అధికంగా తరలివస్తా రు. వచ్చే భక్తులు స్వామికి దాసంగాలు సమర్పించడం ఆనవాయితీ. వీటిని చేయడానికి కొత్త మట్టి కుండను వాడతారు. దానికి తెల్ల సున్నం పూసి, నామాలు పెట్టి కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తారు. అనంతరం అన్నం, పచ్చి పులుసు, భక్షాలను స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు.
ప్రధాన ఘట్టం ఉద్దాలోత్సవం
బ్రహ్మోత్సవాల్లో ఉద్దాలోత్సవం (పాదుకలు) ముఖ్యమైనది. దీన్ని చూసేందుకు సుమారు 4 లక్షల మంది భక్తులు వస్తారు. ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని వడ్డేమాన్ గ్రామంలోని ఓ వర్గానికి చెందిన ఐదు కుటుంబాలు పాదుకలను తయారు చేస్తాయి. రాయలసీమ నుంచి తెప్పించిన తోలుతో వీటిని కుడతారు. దీపావళి తర్వాత వీటిని కుట్టే పని ప్రారంభిస్తారు. ఇందుకు ఏడు రోజుల సమయం పడుతుంది.
ఆ రోజుల్లో ఐదు కుటుంబాలు నిష్టతో ఉపవాస దీక్షలు చేస్తాయి. ఉద్దాలను సిద్ధం చేసిన తర్వాత వాటిని కురుమూర్తికి తరలిస్తారు. అదే గ్రామానికి చెందిన మేదరులు తయారు చేసిన ప్రత్యేక చాటలో ఉద్దాలను ఉంచి ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఆ సమయంలో దారి పొడవునా వేల మంది భక్తులు పాదుకలను తాకేందుకు ప్రయత్నిస్తారు. రాత్రి జాతర మైదానంలో పాదుకలను ఊరేగించిన తర్వాత గుట్ట మీద ఉన్న ఉద్దాల మండపానికి చేరుస్తారు.
ముక్కెర వంశస్తుల ఇలవేల్పు
అమరచింత సంస్థానాధీశులైన ముక్కెర వంశస్తుల ఇలవేల్పు కురుమూర్తి వేంకటేశ్వరుడు.15వ శతాబ్దంలో స్వామి వారికి రాజా సోమభూపాల్బంగారు ఆభరణాలను చేయించారు. ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా వీటినిస్వామికి అలంకరిస్తారు. మొదట్లో రాజావారి బంగ్లాలోనే భద్రపరిచేవారు. 1968లో క్షేత్రం దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లింది. దీంతో 1976 నుంచి ఆత్మకూరు లోని ఎస్బీఐ లాకర్లో భద్రపరుస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పోలీసు భద్రత, భారీ ఊరేగింపు మధ్య ఆభరణాలను కురుమూర్తికి తీసుకొస్తారు. ముగిసిన తర్వాత మళ్లీ తీసుకెళ్లి లాకర్లో భద్రపరుస్తారు.
మటన్ సీకులకు ఫేమస్
బ్రహ్మోత్సవాల అనంతరం కురుమూర్తిలో నెల రోజుల పాటు జాతర జరుగుతుంది. ఇందులో మటన్ సీకుల(మటన్కబాబ్)కు ఫేమస్. ఆలయానికి అర కిలోమీటరు దూరంలోనే 60 వరకు మటన్ షాపుల ను ఏర్పాటు చేస్తారు. సీకుల్లో వినియోగించే మసాలాను ముద్దలా చేసుకొని, జాతరకు ముందే తయారు చేసి పెట్టుకుంటారు. జాతర నడిచేటప్పుడు మటన్ముక్కలను బొగ్గుల మీద కాలుస్తారు. వాటిని వినియోగదారులకు అమ్ముతుంటారు.