చిన్నచింతకుంట, వెలుగు : కురుమూర్తి ఆలయం నిరాదరణకు గురవుతోంది. ఏటా జరిగే బ్రహ్మోత్సవాల ద్వారా కోట్లలో ఆదాయం వస్తున్నా.. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మాత్రం పారిశుధ్యంపై దృష్టి పెట్టడం లేదు. గర్భ గుడి సమీపంలో ఉన్న లడ్డూ తయారీ కేంద్రంలో ఉన్న మరుగుదొడ్లు, మూత్రశాలల నుంచి కొద్ది రోజులుగా మురుగు నీరు బయటకు వస్తోంది. అక్కడి నుంచి రాజగోపురం వరకు లీకేజీ అవుతూ ఎండోమెంట్ ఆఫీస్ ముందు నుంచి మహబూబ్‌నగర్‌కు వెళ్లే ప్రధాన రోడ్డు వరకు పారుతోంది.
లడ్డూ తయారీ కేంద్రం వద్ద డ్రైనేజీ నిండి ఓవర్ ఫ్లో అవుతున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. శానిటేషన్ సిబ్బంది ఉన్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. గర్భగుడికి వెళ్లే మెట్ల మార్గం నుంచి స్వామి దర్శనం కోసం వెళ్లే భక్తులు కంపు వాసనను తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. నవంబరు 14 నుంచి ప్రారంభమైన కురుమూర్తి జాతర ఆదివారం ముగిసింది.
జాతర మైదానం ప్రస్తుతం అపరిశుభ్రంగా మారింది. ప్లాస్టిక్ కవర్లు, మద్యం సీసాలు, పేపర్ ప్లేట్లు పడి ఉన్నాయి. సత్రాలు, అద్దె గదులు అపరిశుభ్రంగా మారాయి. జాతర ముగిసిన వెంటనే శానిటేషన్ పనులు చేయించాల్సి ఉన్నా.. ఇప్పటి వరకు ఎండోమెంట్ ఆఫీసర్లు చర్యలు తీసుకోలేదు. ఈ విషయంపై ఈవో మధనేశ్వర్ రెడ్డిని ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.