జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లాలో నిర్వహిస్తున్న పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్.. రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ పై చేసిన ఆరోపణలను కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తీవ్రంగా ఖండించారు. పార్లమెంటు సభ్యుడై ఉండి ముఖ్యమంత్రిని వాడు, వీడు అంటూ మాట్లాడడం సరికాదన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత జైలుకెళ్తారంటూ బండి సంజయ్ మాట్లాడుతున్నారని, తప్పు చేస్తే కవితైనా, ఇంకెవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని అన్నారు. నిజంగానే తప్పు చేస్తే జైలుకెళ్లడానికైనా వారు సిద్ధమని చెబుతున్నా.. మళ్లీ ఎందుకు విమర్శలు చేయడమని ప్రశ్నించారు.
ప్రజా సంగ్రామ పాదయాత్రలో సీఎం కేసీఆర్ ను విమర్శించడం తప్ప ఇంకా ఏమైనా ఉందా..? అని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో పాదయాత్రలో చెప్పడం లేదన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిలో 10 శాతమైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిందా..? ఒకవేళ నిరూపిస్తే తాము తలవంచుకుంటామని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కోసం దేశం ఎదురు చూస్తోందన్నారు. తెలంగాణతో కేసీఆర్ కు బంధం తెగిపోయిందని బండి సంజయ్, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నట్లు చెప్పారు.
కోరుట్ల నియోజకవర్గంలో వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలకు రూ.14.83 కోట్లు మంజూరు అయ్యాయని మ్మెల్యే విద్యాసాగర్ రావు చెప్పారు. జనవరిలోగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. తాను పద్మశాలీలకు అన్యాయం చేశానని బండి సంజయ్ ఆరోపించడం సరికాదన్నారు. మొదటి నుండి ఖాదీ బోర్డు చైర్మన్ ఎలా ఎన్నుకున్నారో అలాగే తనను ఎన్నుకున్నారని చెప్పారు. తాను పద్మశాలీల నుండి పదవి లాక్కోలేదన్నారు. ఖాళీ స్థలంలో వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేసి.. ఖాదీ బోర్డుకు ఆదాయం పెంచేలా చేశామన్నారు. రూపాయి తీసుకోకుండా ఖాదీ బోర్డుకు సేవ చేస్తున్నానని చెప్పారు.