Cricket World Cup 2023: న్యూజిలాండ్‌పై ప్రశాంతంగా ఆడుకుంటాం: బంగ్లా జట్టుపై శ్రీలంక కెప్టెన్ సెటైర్

Cricket World Cup 2023: న్యూజిలాండ్‌పై ప్రశాంతంగా ఆడుకుంటాం: బంగ్లా జట్టుపై శ్రీలంక కెప్టెన్ సెటైర్

శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ అంటే చాలు వివాదాలు ఉండాల్సిందే. గత 10 ఏళ్లలో వీరి మధ్య ఐసీసీ, ఆసియా కప్ లాంటి ట్రోఫీలో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. తాజాగా ఈ వరల్డ్ కప్ లో మాథ్యూస్ టైమ్డ్-అవుట్ విషయంలో  పెద్ద దుమారమే చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ కు క్రీడా స్ఫూర్తి లేదంటూ మాథ్యూస్ తో పాటు శ్రీలంక ఆటగాళ్లు, పలువురు మాజీలు తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం గుప్పించారు. 

ఈ విషయాన్నీ శ్రీలంక చాలా సీరియస్ గా తీసుకోగా.. తాజాగా బంగ్లా జట్టుపై లంక కెప్టెన్ కుశాల్ మెండిస్ పరోక్షంగా సెటైర్ విసిరాడు. వరల్డ్ కప్ లో భాగంగా ప్రస్తుతం శ్రీలంక, న్యూజీలాండ్ జట్లు తలపడుతున్నాయి. బెంగళూరు వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో న్యూజీలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. ఇక టాస్ సమయంలో మెండిస్ మాట్లాడుతూ న్యూజీలాండ్ జట్టుపై ప్రశంసలు  కురిపించాడు. కివీస్ జట్టు చాలా కామ్ గా ఉంటుంది. వారితో మేము చాలా ప్రశాంతంగా మ్యాచ్ ఆదుకుంటాం అనే వ్యాఖ్యలు చేసాడు. 

మెండిస్ చేసిన ఈ వ్యాఖ్యలు బంగ్లాదేశ్ క్రీడా స్ఫూర్తి గురించే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ మ్యాచ్ లో న్యూజీలాండ్ గెలిస్తే దాదాపు సెమీస్ కు చేరుకుంటుంది. మరో వైపు 2025 ఛాంపియన్స్ ట్రోఫీకు లంక అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్ లో గెలవడం తప్పనిసరి. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసేసరికి లంక జట్టు 5 వికెట్లను కోల్పోయి 74 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా వేగంగా ఆడి హాఫ్ సెంచరీ(51) చేసాడు. బౌల్ట్ 3, సౌథీ, ఫెర్గుసన్ లకు చెరో వికెట్ లభించింది. మాథ్యూస్(0), ధనుంజయ డిసిల్వా(4) క్రీజ్ లో ఉన్నారు.