పరిచయం : యాక్టింగ్​ అనేది నాన్న డ్రీమ్​​

పరిచయం : యాక్టింగ్​ అనేది నాన్న డ్రీమ్​​

ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం. అందుకు తండ్రి కూడా సపోర్ట్ చేసేవాడు. కానీ, ఆమె చదువుకునే రోజుల్లోనే ఆయన చనిపోయాడు. ‘అసలు నటన గురించి ఆలోచించనే వద్దు’ అంది తల్లి. అమ్మ మాట విని ఫ్యాషన్ డిజైనింగ్​ చేసింది. పేరు తెచ్చుకుంది. కానీ, మనసేమో నటన వైపే లాగుతోంది. దాంతో ఎలాగోలా తల్లిని ఒప్పించి, కెమెరా  ముందుకొచ్చింది.  తన యాక్టింగ్​తో ప్రశంసలు అందుకుంటోంది ఖుషాలి కుమార్. ఆమె సినీ జర్నీ ఎలా సాగిందో ఆమె మాటల్లోనే.. 

‘‘మాది ఢిల్లీ.  నాన్న గుల్షన్ కుమార్.. ఫిల్మ్ ప్రొడ్యూసర్, బిజినెస్​ మ్యాన్. అమ్మ సుదేశ్​ కుమారి. నాన్న చనిపోయాక అమ్మ బిజినెస్​లు చూసుకుంటోంది. నాకు ఒక అన్న, ఒక చెల్లి ఉన్నారు. అన్న భూషణ్​ కుమార్, బిజినెస్ మ్యాన్. చెల్లి తులసి కుమార్, సింగర్. మా నాన్న అప్పట్లోనే టీ– సిరీస్​ సంస్థను స్థాపించారు. అందులో ఎంతోమంది యాక్టర్స్​కు అవకాశం ఇచ్చారు. దాని మెయిన్ ఆఫీస్​ ఢిల్లీలో ఉంది. దాన్ని అమ్మ నడుపుతోంది. నేను క్రియేటివిటీ సైడ్ ఉంటా. టీ–సిరీస్​ పనుల్లో, వాళ్ల నిర్ణయాల్లో తలదూర్చను. అమ్మకు, అన్నయ్యకు ఎమోషనల్ సపోర్ట్​ ఇస్తా. 

డిజైనింగ్ కెరీర్​

చిన్నప్పటి నుంచి నాకు యాక్టర్ అవ్వాలని ఉండేది. నాన్న తీసిన చాలా ఫిల్మ్స్​కి నేను కూడా వర్క్ చేశా. నా యాక్టింగ్ ​విషయంలో నాన్న ఒక్కరే నన్ను సపోర్ట్ చేశారు. కానీ, ఆయన చనిపోయాక ఢిల్లీకి షిఫ్ట్ అయ్యాం. నేను నటిస్తానంటే.. ఫేమ్, పాపులారిటీల గురించి భయపడి అమ్మ ఒప్పుకోలేదు. న్యూ ఢిల్లీలోని ‘నేషనల్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్​ఐఎఫ్​టీ)’లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశా. దాంతో ఫ్యాషన్​ డిజైనింగ్​ కెరీర్​ని కొనసాగించమని చెప్పింది అమ్మ. అలా ఫ్యాషన్ డిజైనర్​గా కెరీర్ మొదలుపెట్టా.

నేను డిజైన్ చేసిన బట్టలను మొదటిసారి ప్యారిస్​లో ప్రదర్శించా. తర్వాత న్యూయార్క్​లో. అక్కడికి చాలామంది సెలబ్రిటీలు వస్తుంటారు. ఇలాంటి స్టోర్స్​ వందలకొద్దీ ఉంటాయక్కడ. ఆ స్టోర్స్​ను హాలీవుడ్ స్టార్స్ విజిట్ చేస్తారు. షకీరా, జస్టిన్ బీబర్ పర్సనల్ స్టయిలిస్ట్​లు షోస్​కు వస్తారు.  వాళ్లు ఫొటోలు తీసి, సెలబ్రిటీ ఫ్రెండ్స్​కు పంపిస్తారు. అలా నేను డిజైన్ చేసిన డ్రెస్ ఒకటి షకీరాకి నచ్చింది.

ఆ విషయం విన్న రోజు రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. చాలా థ్రిల్​ ఫీలయ్యా. అలా పెద్ద పెద్ద స్టార్స్​కు డిజైన్ చేసే అవకాశం వచ్చింది. వాళ్లలో లీయన్ రైమ్స్, జెన్నా దెవన్ టాటుమ్, స్పైస్ గర్ల్ మెలనీ సి, కార్మెన్ ఎలెక్ట్రా వంటి వాళ్లు ఉన్నారు. జస్టిన్ బీబర్ మ్యూజిక్ వీడియో ‘వెయిట్ ఫర్​ ఎ మినిట్​’ కోసం కూడా డ్రెస్ డిజైన్ చేశా. నాకు ప్యారిస్​లో ‘రెవ్’ అనే స్టోర్​ ఉంది. ‘రెవ్’​ అంటే ఫ్రెంచ్​లో ‘కల’ అని అర్థం.

అమ్మని ఒప్పించి...

నాన్న చనిపోయాక అమ్మ చాలా భయపడిపోయింది. నన్ను, చెల్లిని తీసుకుని ఢిల్లీకి మారిపోయింది. అన్నయ్య కాలేజీ నుంచి వచ్చేసి, కంపెనీ చూసుకున్నాడు. ఆ టైంలో ఐదు వేల మంది టీ–సిరీస్​లో పనిచేస్తున్నారు. అమ్మే మా ముగ్గురిని చూసుకోవాలి. కాబట్టి ఆమెకి మమ్మల్ని కెమెరా ముందుకు పంపించడం ఇష్టం లేదు. అంతెందుకు గత ఆరేడేండ్లుగా అన్నయ్య కెమెరా ముందుకొస్తున్నాడు.  ‘మీరు ఏం చేసినా... అది కెమెరా వెనకే చేయండి’ అని చెప్పింది అమ్మ.

అలా గట్టిగా ఒక నిర్ణయంతో ఉన్న అమ్మను కన్విన్స్ చేయడానికి చాలా టైం పట్టింది. ‘త్రీ ఇడియట్స్’లో మాధవన్​ తన కలను నెరవేర్చుకునేందుకు తండ్రిని కన్విన్స్ చేసిన సీన్స్ గుర్తుతెచ్చుకునేదాన్ని. చివరికి ఎలాగో అమ్మని ఒప్పించి, నా లక్​ని పరీక్షించుకునేందుకు ముంబయి వెళ్లా. అంతకుముందు ఫ్యాషన్ డిజైనర్​గా నా వర్క్​కి ఎన్నో  ప్రశంసలు దక్కాయి. అప్పుడు నా డైలీ రొటీన్​ ఎలా ఉండేదంటే... పనికి వెళ్లడం, ఇంటికి రావడం, అమ్మ ముందు ఏడవడం. నాన్న గురించి ప్రింట్​ అయిన ఆర్టికల్స్ అమ్మకు చూపించేదాన్ని. ‘యాక్టింగ్ అనేది నాన్న డ్రీమ్ కూడా’ అని పదే పదే చెప్పి ఎలాగోలా నటించేందుకు అమ్మతో ‘ఓకే’ అనిపించా!

మ్యూజిక్ వీడియోల్లో...

నాన్నకు ట్రిబ్యూట్​గా ఒక వీడియో చేశాం. దానికోసం నా చెల్లి తులసి పాట పాడింది. నేను అందులో నటించా. అలా మొదటిసారి కెమెరా ముందుకొచ్చా. 2015లో బాలీవుడ్ సాంగ్ వీడియో ‘మైను ఇష్క్ దా’  అనే మ్యూజిక్ వీడియోతో ఎంట్రీ ఇచ్చా. ఆ తర్వాత ‘మేరా హైవే స్టార్, రాత్​ కమాల్​ హై’లలో యాక్ట్​ చేశా. వాటిలో ఒకటి ‘జీనా ముష్కిల్​ హై యార్’. అది చాలా ఫిల్మ్​ ఫెస్టివల్స్​లో చూపించారు. అంతేకాదు.. తొమ్మిదవ దాదాసాహేబ్ పాల్కే ఫిల్మ్ ఫెస్టివల్​ అవార్డుల్లో హానరబుల్ జ్యూరీ మెన్షన్ అవార్డ్ అందుకుంది. 

సినిమాల్లో అవకాశం వచ్చిందలా...

‘జీనా ముష్కిల్ హై యార్​’ అనే షార్ట్​ఫిల్మ్​కి బెస్ట్ క్రిటిక్స్ అవార్డ్ వచ్చింది నాకు. ఆ షార్ట్ ఫిల్మ్ మాధవన్ చూశారు. ఆయనకు నా యాక్టింగ్ నచ్చింది. అప్పుడు ఒక స్క్రిప్ట్ ఉంది ‘దహీ చీనీ’ అని. కాకపోతే ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్న టైంలోనే కూకీ స్టోరీ వచ్చింది. అది మాధవన్​​కి బాగా నచ్చింది. దాంతో ఆ సినిమా పట్టాలెక్కింది. అదే ‘ధోఖా రౌండ్ డి కార్నర్’. అలా మొదటిసారి నేను యాక్టింగ్​లోకి అడుగుపడింది.

ఆ సినిమాలో ఆర్​. మాధవన్​ది లీడ్​ రోల్​. నాది లాయర్​ క్యారెక్టర్. ఈ కథ  ఎంచుకోవడానికి కారణం.. అందులో క్యారెక్టర్స్ ఎగ్జయిటింగ్​గా ఉన్నాయి. ఆ క్యారెక్టర్​తో నేను ఎంతో చేయొచ్చు అనిపించింది. తర్వాత నేను రియలైజ్ అయిందేంటంటే... నా పాత్ర సాంచీని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు అని. తను ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు. అది చాలా కష్టం. కానీ, కష్టంగా ఉండేవే మంచి ఫలితాన్నిస్తాయని నమ్ముతా. నేను సెట్​కి వెళ్లాక, చాలాసార్లు డైరెక్టర్​ దగ్గర కూర్చుని డిస్కస్ చేస్తా.

సాంచీ క్యారెక్టర్​ని అర్థం చేసుకోవడానికి చాలా ట్రై చేశాను. అంతేకాకుండా అక్కడ నిల్చుని డైలాగ్స్​ చెప్పడం అనేది చాలా కష్టంగా అనిపించేది. అవతలి వ్యక్తిని మ్యాచ్ చేస్తూ ఒకే ఫ్రేమ్​లో ఉంటూ డైలాగ్స్ చెప్పడం పెద్ద ఛాలెంజ్. పైగా పెద్ద యాక్టర్స్​తో కలిసి నటిస్తున్నప్పుడు ఎగ్జయిట్​మెంట్ అనేది ఉంటుంది. మొదటి రోజు షూటింగ్​లో మాధవన్​తో సీన్ చేయాల్సి ఉంది. అయితే, ఆయనకు కో–యాక్టర్​ని ఎలా రిలాక్స్ చేయాలో తెలుసు. దాంతో నేను కంఫర్టబుల్​గా యాక్టింగ్ చేశా. 

అయితే, మ్యూజిక్ వీడియోలు, సినిమాల్లో నటించడం ఒకేలా ఉండదు. సినిమా అనేది పర్ఫార్మెన్స్​ మీద ఆధారపడి ఉంటుంది. అంతెందుకు నా మొదటి సినిమాలో సాంచీ పాత్ర సినిమా మొత్తం చీరలోనే ఉంటుంది. అందుకోసం నేను స్క్రిప్ట్ చదువుకునేటప్పుడు కూడా చీరలోనే ఉండేదాన్ని. సీన్స్​కి ఎలా రియాక్ట్​ అవ్వాలో శారీతోనే ప్రిపేర్​ అయ్యేదాన్ని. మ్యూజిక్ వీడియోలు ఎంటర్​టైనింగ్​గా ఉంటాయి. ఫన్, డాన్స్ ఉంటాయి. 

నాన్న జ్ఞాపకాలు

నాన్నతో గడిపిన క్షణాలు వెలకట్టలేనివి. ఆయనతో కలిసి షూటింగ్స్​కు వెళ్లేదాన్ని. స్కూల్లో చదువుతున్నప్పుడు మొదటిసారి ‘సిండ్రెల్లా’ నాటకం వేసినప్పుడు నాన్న చూశారు. నాన్న ఆలోచన ఎలా ఉండేదో చెప్పాలంటే మీకో సంఘటన గురించి చెప్పాలి. ముంబయిలో చాలామంది పంజరంలో పక్షుల్ని అమ్ముతుంటారు. ఒకసారి నాన్న అక్కడున్న పంజరాలన్నింటినీ కొన్నారు. తరువాత పంజరం తెరిచి పక్షుల్ని బయటకు వదిలేశారు. తర్వాతి రోజు కూడా అలానే చేశారు. పక్షుల్ని అమ్ముతున్న వాళ్లతో ‘నాకు నోయిడాలో ప్యాక్టరీ ఉంది. అక్కడికి వచ్చి పనిచేసుకోండి. ఈ పక్షులు స్వేచ్ఛను ఆస్వాదించాలి. వాటిని ఇలా బంధించకూడదు’ అని చెప్పారు. నాన్న గురించి చెప్పాలంటే ఇలాంటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి.

ఫ్యాషన్​.. నా బెస్ట్ ఫ్రెండ్

నిఫ్ట్​లో చదివేటప్పుడు డిజైన్ క్లాసులు ఎగ్గొట్టి, యాక్టింగ్ క్లాసులకు వెళ్లేదాన్ని. యాక్టింగ్​ చేస్తున్నా ఇప్పటికీ ఫ్యాషన్ నా హాబీ. నా డిజైన్స్​ని ప్యారిస్, న్యూయార్క్​లలో ప్రదర్శించా. అలాంటి చోట్ల గుర్తింపు దక్కితే ఎంకరేజ్​మెంట్ ఇస్తుంది. నేను అనుకున్నది ఏదో ఒకరోజు చేయగలను అని మోటివేట్ చేస్తుంది. ఇప్పుడు ఫ్యాషన్ అనేది నా బెస్ట్ ఫ్రెండ్​. ఎప్పటికీ నాతోనే ఉంటుంది.

- ప్రజ్ఞ