ఆశ్రమ స్టూడెంట్లకు మెరుగైన విద్యనందించాలి : కుష్భు గుప్తా

ఆదిలాబాద్, వెలుగు: ఆశ్రమ పాఠశాలల స్టూడెంట్లకు మెరుగైన విద్యనందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీఓ కుష్భు గుప్తా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆదిలాబాద్ మండలంలోని చించుఘాట్ ఆశ్రమ స్కూల్, టీడబ్ల్యూపీఎస్ స్కూల్, వాన్ వాట్ అంగన్వాడీ కేంద్రం, జండాగూడలో పీఓ పర్యటించారు. విద్యార్థులకు అందుతున్న విద్య, వైద్యం, భోజనంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతిరోజూ మెనూ ప్రకారం పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలన్నారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని సూచించారు. నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అనంతరం విద్యార్థులకు పాఠాలు భోదించి సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు.