కూసుకుంట్ల చెల్లని రూపాయి: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

యాదాద్రి, వెలుగు : 'అబద్దాలు ఆడడంలో అయ్య ఏక్​ నంబర్ అయితే బేటా దస్​ నంబర్​' అని సీఎం కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్​ను ఉద్దేశించి టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రి జిల్లా సంస్థాన్​ నారాయణపురం, పుట్టపాకలో కాంగ్రెస్​అభ్యర్థి పాల్వాయి స్రవంతితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూసుకుంట్ల చెల్లని రూపాయి కాబట్టే.. మునుగోడును దత్తత తీసుకుంటానని కేటీఆర్​ ప్రకటించారన్నారు. మునుగోడులో కూసుకుంట్ల గెలిస్తే.. ఉన్న వంద గాడిదలకు తోడు 101వ గాడిద చేరుతుందే కానీ తెలంగాణకు ఉపయోగం లేదన్నారు.

నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరిస్తున్నారని, వాళ్లపై  ఈగ వాలినా చెట్లకు కట్టేసి కొడతానని హెచ్చరించారు. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిస్తే టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు చేస్తుందని, గిరిజనుల భూములకు పట్టాలు వస్తాయన్నారు. నియోజకవర్గంలోని ఆడబిడ్డలు అంతా కలిసి పాల్వాయి స్రవంతి కి ఓట్లు వేస్తే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్తుందన్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, రోహిత్ చౌదరి, పున్న కైలాస్ నేత, చలమల కృష్ణారెడ్డి, చెరుకు సుధాకర్, బండ్రు శోభారాణి, గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు.