టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి లేదు : కూసుకుంట్ల

‘‘2018లో నేను ఓడిపోయాను.. ఈ ఉప ఎన్నికలోనైనా నన్ను గెలిపించాలనే కృత నిశ్చయంతో టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తం మునుగోడుకు వచ్చింది. అందులో తప్పేముంది’’ అని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ‘‘బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోసం దేశంలో ఉండే అందరు నేతలు వస్తే తప్పులేదు కానీ ... నా కోసం తెలంగాణ నేతలు వస్తే తప్పేంటి?’’ అని ఆయన ప్రశ్నించారు. ‘‘టీఆర్ఎస్ లో అసంతృప్తి లేదు. అందరం కలిసి పని చేస్తున్నాం. బీజేపీ నేతలు కావాలనే మా మధ్య అసంతృప్తి ఉందంటూ దుష్ప్రచారాన్ని చేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రెండో సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించిన అనంతరం  మీడియా సమావేశంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు.

టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి లేనే లేదని, నాయకులు అందరం కలిసి నామినేషన్ వేశామని తెలిపారు. ‘‘కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వార్ధ రాజకీయం కోసమే ఈ ఉపఎన్నిక వచ్చింది. గత మూడున్నర సంవత్సరాలుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని  మునుగోడు నియోజకవర్గ ప్రజలెవరూ చూడలేదు’’అని చెప్పారు. ‘‘గతంలో ఎమ్మెల్యేగా నేను చేసిన అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది. గ్రామగ్రామాన ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నామని చెబుతున్నారు’’ అని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  తెలిపారు. కాగా, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రెండో సెట్ నామినేషన్ పత్రాలను ఆయన సమర్పించారు. ఈసందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వెంట ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తదితరులు ఉన్నారు. 

అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూలదోసిన బీజేపీ : కర్నె ప్రభాకర్ 

దేశంలోని అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలను బీజేపీ కూలదోసిందని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. అదే తరహాలో తెలంగాణలోనూ ఉప ఎన్నికలకు తెరలేపిందని ఆరోపించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఈ ఉప ఎన్నిక వచ్చిందన్నారు. భవిష్యత్తులో అభివృద్ధి కావాలంటే మునుగోడు నియోజకవర్గ ప్రజలంతా కేసీఆర్ వెంట ఉండాలని కోరారు. అభివృద్ధి వద్దు అనుకునే వాళ్లంతా వ్యతిరేక పార్టీ వైపు ఉండాలన్నారు. తెలంగాణ సంక్షేమ పథకాలను అమలు చేయాలని దేశంలోని 28 రాష్ట్రాల ప్రజలు డిమాండ్ చేస్తు్న్నారని తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమం సందర్భంగా  కర్నె ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు టీఆర్ఎస్ పాలనలో న్యాయం జరిగిందన్నారు. ‘‘ మునుగోడు ప్రజలకు మళ్లీ ఒక అవకాశం వచ్చింది.. కూసుకుంట్లను గెలిపించుకోవాలి’’ అని ఆయన కోరారు.