హామీలు.. తాయిలాలతో టీఆర్ఎస్ గెలుపు

హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్.. అందులో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డింది. సీఎం కేసీఆర్ రెండుసార్లు బహిరంగ సభలు నిర్వహించగా..  14 మంది మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు తమ సొంత నియోజకవర్గాలను వదిలి మునుగోడులోనే దాదాపు నెల పాటు పని చేశారు. గెలవడానికి పనికొచ్చే ఏ చిన్న అవకాశాన్నీ అధికార పార్టీ  వదులుకోలేదు. చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి మునుగోడు ఓటర్లను ప్రసన్నం చేసుకుంది. గట్టుప్పల్ మండలం ఏర్పాటు, కొత్త పింఛన్ల మంజూరు, చేనేత బంధు మొదలు ఎల్ బీ నగర్ లో ఇంటి స్థలాల రెగ్యులరైజేషన్ వరకు మునుగోడు ఓటర్లతో ముడిపడి ఉన్న అనేక పెండింగ్ సమస్యలకు పరిష్కారం చూపింది. 

సమస్యలన్నీ పరిష్కారం.. 

రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్తున్నారని తెలియగానే సీఎం కేసీఆర్ అప్రమత్తమయ్యారు. రాజగోపాల్ రాజీనామాకు ముందే గట్టుప్పల్ మండలం ఏర్పాటు చేశారు. మూడున్నరేండ్లుగా పెండింగ్​లో ఉన్న 10 లక్షల కొత్త పింఛన్లకు ఆమోదం తెలిపారు. గిరిజన బంధు ప్రకటించడంతో పాటు గిరిజనుల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ జీవో ఇచ్చారు. రెండో విడత గొర్రెల పంపిణీలో గొర్రెలకు బదులు నగదు బదిలీ స్కీమ్ తెచ్చారు. మునుగోడులో పద్మశాలి ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండడంతో చేనేత బంధు, చేనేత బీమా ప్రకటించారు. చౌటుప్పల్ – నారాయణపురం రోడ్డు వేశారు. హైదరాబాద్ లోని ఎల్ బీ నగర్ సహా ఆరు నియోజకవర్గాల్లో నిషేధిత జాబితాలో ఉన్న ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సమస్య 15 ఏండ్లుగా పెండింగ్ లో ఉండగా.. ఎల్ బీ నగర్ లో ఎక్కువ మంది మునుగోడు ఓటర్లు ఉండడంతో ఎన్నికకు ముందు పరిష్కారం చూపారు. డిండి ఎత్తిపోతల పథకం భూనిర్వాసితులకు రూ.116 కోట్లు, పెండింగ్ లో ఉన్న షాదీ ముబారక్‌‌, కల్యాణలక్ష్మికి రూ. 14.73 కోట్లు, 7,600 గొర్రెల యూనిట్లకు రూ. 99.75 కోట్లు, మధ్యాహ్న భోజనానికి రూ. 40 లక్షలు సహా ఉద్యోగులు, ఉపాధ్యాయుల మెడికల్ బిల్లుల బకాయిలను విడుదల చేశారు. 140 యూనిట్ల దళిత బంధు జాబితా సిద్ధం చేశారు. అన్ని కులాల వారీగా ‘ఆత్మీయ’ సమావేశాలు నిర్వహించి హామీల వర్షం గుప్పించారు. చివరికి ఎన్నడూ లేనిది ఈ నెలలో నల్గొండ, యాదాద్రి జిల్లాల్లోని గవర్నమెంట్ ఉద్యోగులకు ఫస్ట్ తారీఖే జీతం వేశారు. 

ప్రలోభాల పర్వం.. 

ఎన్నికకు నోటిఫికేషన్ రావడంతోనే టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడు గ్రామాల్లో అడ్డా వేశారు. 2.50 లక్షల మంది ఓటర్లకు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలు.. రెండున్నర వేల ఓట్ల పోల్ మేనేజ్మెంట్ కోసం నిద్రాహారాలు మాని శ్రమించారు. పోలింగ్​కు 20 రోజుల ముందు నుంచే ప్రలోభాల పర్వం మొదలైంది. రోజూ ఒక్కో ఓటరుకు క్వార్టర్ మందు, వారంలో రెండుసార్లు చికెన్ పంపిణీ చేశారు. ఓటర్లను పోలింగ్‌‌ బూత్‌‌కు తీసుకెళ్లేందుకు అవసరమైన తాయిళాలు పంపిణీ చేశారు. పోలింగ్ కు ఒక రోజు ముందు ఒక్కో ఓటుకు రూ.5 వేల వరకు ఇచ్చినట్లు స్వయంగా ఓటర్లే అనేక యూట్యూబ్ చానళ్ల ఎదుట ఓపెన్ గానే ప్రకటించారు. 

రాజగోపాల్ రాజీనామాకు ముందే రంగంలోకి కేసీఆర్.. 

రాజగోపాల్‌‌ రెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు ముందే గుర్తించిన కేసీఆర్.. ఉప ఎన్నికకు సన్నద్ధమయ్యారు. రాజగోపాల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వెంటనే రంగంలోకి దిగారు. ప్రచారం నుంచి పోల్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ వరకు అన్నీ తానై వ్యవహరించారు. దుబ్బాక, హుజూరాబాద్‌‌ ఉప ఎన్నికలతో పాటు జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లకు తావివ్వకుండా గులాబీ బలగాన్నంత మునుగోడులో దింపారు. 86 ఎంపీటీసీ స్థానాలకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను ఇన్‌‌చార్జులుగా నియమించారు. తానూ స్వయంగా ఒక గ్రామానికి ఇన్‌‌చార్జ్ గా ఉన్నారు. రాజగోపాల్‌‌ రాజీనామా చేశాక మునుగోడుకు వేల కార్లతో కాన్వాయ్‌‌గా వెళ్లి, తమ పార్టీని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. పోలింగ్​కు ముందు చండూరు మండలం బంగారుగడ్డలో నిర్వహించిన సభకు వెళ్లి టీఆర్‌‌ఎస్‌‌ను గెలిపిస్తే 15 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కేటీఆర్‌‌, హరీశ్‌‌రావుకు బైపోల్‌‌ కో ఆర్డినేషన్‌‌ బాధ్యతలు అప్పగించి.. లోటుపాట్లు ఉంటే వాటిని ఎప్పటికప్పుడు సవరించుకుంటూ వెళ్లారు.