ఇటీవల కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ ట్రేడ్ మార్క్(సీజీపీడీటీఎం), గుజరాత్‌లోని కచ్‌కు చెందిన కచ్ అఖ్రాజ్ సంప్రదాయ వస్త్ర కళా రూపానికి భౌగోళిక సూచిక సర్టిఫికేట్‌ను జారీ చేసింది. కచ్ అజ్రఖ్ 2500 సంవత్సరాల నాటిది. ప్రస్తుతం సింధ, బార్మర్, కచ్ ప్రాంతాల్లో ఆచరిస్తారు. ఇది 100 శాతం పర్యావరణహితమైన, విషరహితమైంది.
అజ్రఖ్ కళలో ఒంటె పేడ, న్యాచురల్ కాస్టిక్ సోడా, ఆముదం నూనె, నీళ్లతో చేసిన మిశ్రమంతో ముడి వస్త్రం(కాటన్, ఉన్ని, పట్టు)పై ఉండే మలినాలను తొలగించి శుద్ధి చేసిన తర్వాత కాటన్, ఉన్ని, పట్టు వస్త్రాలపై చారిత్రక సంఘటనలను చిత్రాల రూపంలో క్లిష్టమైన డిజైన్లతో చాలా శ్రద్ధగా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ప్రక్రియతో ముద్రిస్తారు.
- ప్రత్యేకంగా అజ్రాఖ్ కళలో వస్త్రానికి రెండు వైపులా డిజైన్లను ముద్రిస్తారు. అజ్రాఖ్ కళ ప్రధానంగా కచ్‌లోని అజ్రాఖ్పూర్, ధమడ్కా, ఖావ్డాలోని గ్రామాల్లో అభివృద్ధి చెందింది. ఈ కళను 400 సంవత్సరాల క్రితం సింధ్ ముస్లింలు ఈ ప్రాంతానికి పరిచయం చేశారు.
- అజ్రాఖ్ అంటే అరబిక్ భాషలో నీలిమందు అని అర్థం. నీలం రంగును పొందడానికి రంగుగా ఉపయోగించే ఒక పదార్థం.
- అజ్రఖ్ కళలో చిత్రాలను ముద్రించడానికి సాంప్రదాయకంగా నీలం(ఆకాశానికి సూచిక), ఎరుపు (భూమి, అగ్నికి సూచిక), తెలుపు (నక్షత్రాలకు సూచిక) తదితర మూడు రంగులను ఉపయోగిస్తారు.
- రబారీలు, మాల్దారీలు, అహిర్లు వంటి సంచార పశుపోషకులు, వ్యవసాయం చేసే ప్రజలు అజ్రాఖ్ ముద్రించిన వస్త్రాన్ని తలపాగాలు, లుంగీలు లేదా స్టోల్స్గా ధరిస్తారు.
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌లో మహిళా కోటా
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌లో మహిళా కోటా అమలుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ(ఎస్సీబీఏ)లో మూడింట ఒక వంతు మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని ఆదేశించింది. ఇకపైన ఎస్సీబీఏలో ముగ్గురు ఎగ్జిక్యూటివ్ సభ్యులు, ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు, కోశాధికారి అందరూ మహిళలే ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మానవరహిత బాంబర్ డ్రోన్
రక్షణ శాఖ అవసరాలకు అనుగుణంగా పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో మానవ రహిత బాంబర్ డ్రోన్‌ను ఫ్లయింగ్ వెడ్జ్ సంస్థ తయారు చేసింది. ఈ మానవ రహిత డ్రోన్‌కు ఎఫ్‌డబ్ల్యూడీ – 200బీ అని పేరు పెట్టారు. ఈ మానవ రహిత బాంబర్ డ్రోన్ 100 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. గంటకు 370 కి.మీ. వేగంతో 12 నుంచి 20 గంటలపాటు గగనతలంలో ప్రయాణించే సామర్థ్యం ఈ డ్రోన్‌కు ఉంది. గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ నుంచి 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ బాంబర్ డ్రోన్‌ను త్వరలోనే రక్షణశాఖకు ఫ్లయింగ్ వెడ్జ్ సంస్థ అందించనుంది.