హైదరాబాద్, వెలుగు: ఆరు గ్యారంటీల పేరుతో రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి అభ్యంతరకర పదజాలాన్ని వినియోగిస్తున్నారన్నారు. సీఎం అని మర్చిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఆయన మర్చిపోయారన్నారు. సీఎం అయిన నాలుగు నెలలకే రేవంత్ రెడ్డి ప్రజల విశ్వాసం కోల్పోయారని దుయ్యబట్టారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఉనికిని కోల్పోయిందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలను గెలవకపోతే సీఎం కుర్చీ పోతుందని రేవంత్ భయపడుతున్నారన్నారని ఎద్దేవా చేశారు.