ప్రీమియర్’ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవీ హ్యాట్రిక్

ప్రీమియర్’ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవీ హ్యాట్రిక్
  • 'సీఐటీయూ'పై 30 ఓట్ల మెజార్టీతో గెలిచిన టీఆర్ఎస్ కేవీ

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో 'బీఆర్ఎస్ కేవీ' వరుసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించింది. శనివారం జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవీ సంఘం 30 ఓట్ల మెజార్టీతో గెలిచింది. మొత్తం 390 ఓట్లకు బీఆర్ఎస్ కేవీ సంఘానికి 209 ఓట్లు రాగా.. సీఐటీయూ సంఘానికి 179 ఓట్లు వచ్చాయి. బీఎంఎస్, హెచ్ఎంఎస్ సంఘాలకు ఒక్కో ఓటు చొప్పున వచ్చాయి.

 కాగా బీఎంఎస్ మద్దతుతో బీఆర్ఎస్ కేవీ పోటీ చేయగా.. ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ, హెచ్ఎంఎస్ సంఘాల మద్దతుతో సీఐటీయూ పోటీలో నిలిచింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. అనంతరం 3:30 గంటలకు కౌంటింగ్ షురూ చేయగా అరగంటలో ఫలితం వెలువడింది. బీఆర్ఎస్ కేవీ సంఘానికి 209 ఓట్లు రాగా, సీఐటీయూ సంఘానికి 179 ఓట్లు వచ్చాయి. దీంతో 30 ఓట్ల మెజారిటీతో గెలిచిన బీఆర్ఎస్ కేవీ సంఘం గుర్తింపు సంఘంగా ఎన్నికైందని ఎలక్షన్ ఆఫీసర్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ బి.జాసన్ వెల్లడించారు.

నాలుగు యూనియన్లు ఒక్కటైనా బీఆర్ఎస్ కేవీ దే గెలుపు..

ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవీ సంఘాన్ని ఓడించడానికి సీఐటీయూ, ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ, హెచ్ఎంఎస్ సంఘాలు ఏకమైనా 'బీఆర్ఎస్ కేవీ' నే విజయం వరించిందని డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ కేవీ సంఘం అధ్యక్షుడు గొంగిడి మహేందర్ రెడ్డి తెలిపారు. స్వయంగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రంగంలోకి దిగినా బీఆర్ఎస్ కేవీ గెలుపును అడ్డుకోలేకపోయారని చెప్పారు. ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన హామీలను తప్పక నెరవేర్చుతామని తెలిపారు.