- సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ లేఖ
- తనవల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావొద్దనే ఈ నిర్ణయమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: తన ఫామ్ హౌస్ మూసీ బఫర్ జోన్‌లో గానీ, ఎఫ్టీఎల్‌లో గానీ ఉన్నట్టు తేలితే తానే కూల్చివేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రాంచంద్ర రావు తెలిపారు. ఫామ్ హౌస్ అక్రమని అధికారులు నిర్ధారించిన 48 గంటల్లోగా తన సొంత ఖర్చులతో కూల్చేస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
అధికారులను పంపించే తేదీ, సమయం చెబితే తనపై ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్, ఇతర ప్రతిపక్ష నేతలు, వారి అనుకూల మీడియా ప్రతినిధులు కూడా వచ్చి దీన్ని పరిశీలించవచ్చన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా తనకు చట్టం నుంచి ఎలాంటి మినహాయింపులు వద్దన్నారు. ఒక సాధారణ పౌరుడి విషయంలో చట్టం ఏ విధంగా వ్యవహరిస్తుందో తన విషయంలో అలాగే వ్యవహరించాలని కోరారు. మీ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తన వల్ల ఎలాంటి చెడ్డపేరు రావొద్దనేదే తన ఉద్దేశమని రేవంత్‌కు రాసిన లేఖలో కేవీపీ పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణను తాను స్వాగతిస్తున్నానని చెప్పారు.
నా ఫామ్ హౌస్ అక్రమమైతే కూల్చుతా: పట్నం
తన ఫామ్ హౌస్ నిబంధనల ప్రకారమే ఉందని, ఒక వేళ అది బఫర్ లేదా ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తే తానే దగ్గరుండి కూల్చివేయిస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన సెక్రటేరియట్‌లో మీడియాతో మాట్లాడారు. తన ఫామ్ హౌస్‌పై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు. తన ఫామ్ హౌస్ అక్రమమని వారు ఆధారాలతో వస్తే అందరం కలిసి కూల్చుదామని చెప్పారు. ఫామ్ హౌస్‌కు సంబంధించి తనకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు.