బుమ్రాకి ఛాలెంజ్ విసిరిన 17 ఏళ్ళ కుర్రాడు..వరుసగా మూడు సార్లు ఐదు వికెట్ల ఘనత

బుమ్రాకి ఛాలెంజ్ విసిరిన 17 ఏళ్ళ కుర్రాడు..వరుసగా మూడు సార్లు ఐదు వికెట్ల ఘనత

జస్ప్రీత్ బుమ్రా మీరు మంచి బౌలర్.. కానీ నేను మీ కంటే గొప్పవాడిని..సరిగ్గా 10 రోజుల క్రితం 17 ఏళ్ళ కుర్రాడు  క్వేనా మఫాకా ఇండియన్ స్టార్ బౌలర్ పై ఈ స్టేట్ మెంట్ ఇచ్చి ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యపరిచాడు. తనపై తనకు నమ్మకముందని కొంతమంది చెబితే.. వార్తల్లో నిలవాలని ఇలా చెప్పుకొచ్చాడని మరికొందరు అన్నారు. అయితే తాజాగా ఈ దక్షిణాఫ్రికా 17 ఏళ్ళ పేసర్ మఫాకా తన బౌలింగ్ తో ప్రపంచ క్రికెట్ ను షాక్ కు గురి చేస్తున్నాడు. 
   
అండర్ 19 ప్రపంచ కప్ లో భాగంగా వరుసగా మూడు సార్లు ఐదు వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాఫ్రికా ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. జనవరి 19 న వెస్టిండీస్ తో తొలి సారి 5 వికెట్లు తీసుకున్న ఈ యంగ్ పేసర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. ఆ తర్వాత వరుసగా జింబాబ్వే, శ్రీలంకపై 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. జింబాబ్వేపై 5 వికెట్లు తీయగా.. నిన్న శ్రీలంకపై 6 వికెట్లు పడగొట్టాడు. 

నిప్పులు చెరిగే బంతులతో మఫాకా బౌలింగ్ చేస్తుంటే బుమ్రాకు అంతర్జాతీయ క్రికెట్ లో గట్టి పోటీ ఇచ్చేలా కనబడుతున్నాడు. అండర్-19 క్రికెట్‌లో దక్షిణాఫ్రికా అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల లిస్టులో మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ మ్యాచ్ లో మఫాకా విజ్రంభించడంతో దక్షిణాఫ్రికా 119 పరుగుల భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సఫారీలు 8 వికెట్లను 232 పరుగులు చేస్తే.. లక్ష్య ఛేదనలో లంక జట్టు 113 పరుగులకే ఆలౌటైంది.