WI vs SA 2024: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. సౌతాఫ్రికా జట్టులో బుమ్రాకు ఛాలెంజ్ విసిరిన కుర్రాడు

WI vs SA 2024: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. సౌతాఫ్రికా జట్టులో బుమ్రాకు ఛాలెంజ్ విసిరిన కుర్రాడు

వెస్టిండీస్‌తో జరగబోయే మూడు టీ20ల సిరీస్‌కు దక్షిణాఫ్రికా క్రికెట్ 15 మంది సభ్యులతో కూడిన జట్టును బుధవారం(ఆగస్టు 14) ప్రకటించింది. ఈ జట్టులో అండర్-19 ప్రపంచకప్‌ సంచలన బౌలర్ 18 ఏళ్ళ క్వేనా మఫాకా తొలిసారి సఫారీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతనితో పాటు బ్యాటర్ జాసన్ స్మిత్‌తో తొలి సారి దక్షిణాఫ్రికా జట్టుకు ఎంపికయ్యాడు. అండర్-19 వరల్డ్ కప్ సందర్భంగా మఫాకా అందరికీ షాక్ ఇస్తూ బుమ్రా కంటే తానే గొప్ప బౌలర్ అని చెప్పడం సంచలనంగా మారింది. 

అండర్ 19 ప్రపంచ కప్ లో భాగంగా వరుసగా మూడు సార్లు ఐదు వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాఫ్రికా ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. జనవరి 19 న వెస్టిండీస్ తో తొలి సారి 5 వికెట్లు తీసుకున్న ఈ యంగ్ పేసర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. ఆ తర్వాత వరుసగా జింబాబ్వే, శ్రీలంకపై 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. జింబాబ్వేపై 5 వికెట్లు తీయగా..  శ్రీలంకపై 6 వికెట్లు పడగొట్టాడు. నిప్పులు చెరిగే బంతులతో మఫాకా బౌలింగ్ చేస్తుంటే బుమ్రాకు అంతర్జాతీయ క్రికెట్ లో గట్టి పోటీ ఇచ్చేలా కనబడుతున్నాడు. 

ఇక సౌతాఫ్రికా స్క్వాడ్ విషయానికి వస్తే పలువురు సీనియర్ ఆటగాళ్లు హెన్రిచ్ క్లాసెన్, అన్రిచ్ నార్ట్జే, డేవిడ్ మిల్లర్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, మార్కో జాన్సెన్, తబ్రైజ్ షమ్సీలు రెస్ట్ కల్పించారు. రెగ్యులర్ కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. ఇటీవల టీ20 లకు క్వింటన్ డి కాక్ రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ గా రియాన్ రికిల్టన్ స్థానం దక్కించుకున్నాడు. ఆగస్ట్ 23, 25, 27 తేదీల్లో ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని తరౌబాలోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో ఈ మ్యాచ్ లు  జరుగుతాయి.